Published On:

Jagan Vehicle Inspection: సింగయ్య మృతి కేసు.. జగన్‌కు స్వల్ప ఊరట

Jagan Vehicle Inspection: సింగయ్య మృతి కేసు.. జగన్‌కు స్వల్ప ఊరట

Former CM YS Jagan: పల్నాడు జిల్లా రెంటపాళ్లలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనలో సింగయ్య అనే వృద్ధుడు కారు కింద పడి మృతి చెందాడు. కేసులో పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా జగన్ వాహనాన్ని రవాణా శాఖ అధికారులు శుక్రవారం తనిఖీ చేశారు. సింగయ్య మృతిపై ఇప్పటికే నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ సందర్భంగా పోలీసులు జగన్ వాహనాన్ని స్వాధీనం చేసుకొని జిల్లా పోలీసు కార్యాలయానికి తరలించారు.

 

ఇవాళ ఏపీ 40 డీహెచ్ 2349 వాహనం ఫిట్‌నెస్‌ను రవాణా శాఖ అధికారులు తనిఖీ చేశారు. ఎంవీఐ గంగాధర ప్రసాద్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఇటీవల రెంటపాళ్ల పర్యటనకు జగన్‌ రాగా, గుంటూరు ఏటుకూరు బైపాస్ వద్ద జరిగిన ప్రమాదంలో మాజీ సీఎం కారు కింద పడి సింగయ్య అనే వ్యక్తి మృతిచెందాడు. ఘటనపై గుంటూరు నల్లపాటు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, ఏ1గా డ్రైవర్ రమణారెడ్డి, ఏ2గా జగన్, వైసీపీకి చెందిన సుబ్బారెడ్డి, నాగేశ్వరరెడ్డి, విడుదల రజిని, పేర్నినాని పేర్లు చేర్చారు.

 

కేసు నమోదైన తర్వాత నల్లపాడు పోలీసులు సింగయ్య మృతికి కారణమైన జగన్ ప్రయాణించిన కారును తాడేపల్లికి వెళ్లి స్వాధీనం చేసుకున్నారు. కారును గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉంచారు. ఇవాళ గుంటూరుకు చెందిన రవాణా శాఖ అధికారులు జగన్ కారు ఫిట్‌‌నెస్‌ను చెక్‌ చేశారు. ఆర్టీవోకు చెందిన మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ గంగాధర్ ప్రసాద్ ఆధ్వర్యంలో జగన్ వాహనాన్ని తనిఖీ చేశారు. వాహనం ఫిట్‌గా ఉన్నట్లు రవాణా శాఖ అధికారులు నిర్ధారించారు.

 

జగన్‌కు స్వల్ప ఊరట..
మరోవైపు ఏపీ హైకోర్టులో జగన్‌కు స్వల్ప ఊరట లభించింది. సింగయ్య మృతి ఘటనలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ను దాఖలు చేశారు. పిటిషన్‌పై ఇవాళ హైకోర్టులో విచారణకు రాగా, జగన్ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించారు. కేసు విచారణను జులై 1కి ధర్మాసనం వాయిదా వేసింది. అప్పటి వరకు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇవి కూడా చదవండి: