YSRCP : టీడీపీకి షాక్.. జగన్ సమక్షంలో వైసీపీలోకి ఎస్.బాల సుబ్రమణ్యం

Senior Tdp Leader Joins YSRCP: అన్నమయ్య జిల్లాలో టీడీపీకి భారీ షాక్ తగిలింది. రాజంపేటకు చెందిన సీనియర్ టీడీపీ నేత పార్టీకి రాజీనామా చేశారు. బుధవారం వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో టీడీపీ సీనియర్ నేత సుగవాసి బాల సుబ్రహ్మణ్యం పార్టీలో చేరారు. మాజీ ఎంపీ సుగవాసి పాలకొండ్రాయుడు కొడుకు సుబ్రహ్మణ్యం. నాలుగు దశాబ్దాలుగా టీడీపీలో సుగవాసి కుటుంబం కొనసాగింది. టీడీపీలో జరుగుతున్న అవమానాలు తట్టుకోలేక పార్టీని వీడి జగన్ వెంట నడవాలని నిర్ణయించుకున్నారు.
సుగవాసి పాలకొండ్రాయుడి రాజకీయ వారసుడిగా సుబ్రహ్మణ్యం 1995 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. ఆయన రాయచోటి జడ్పీటీసీ సభ్యుడిగా విజయం సాధించారు. 2000లో ఉమ్మడి కడప జిల్లా పరిషత్ చైర్మన్‌గా పనిచేశారు. 2001లో మరోసారి రాయచోటి జడ్పీటీసీగా గెలిచారు. 2012లో జరిగిన రాయచోటి బై ఎలక్షన్‌లో టీడీపీ తరఫున బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. 2024లో రాజంపేట ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే అయిన సుగవాసి పాలకొండ్రాయుడు పెద్దకుమారుడే సుబ్రహ్మణం.