Guntur Collectorate: కలెక్టర్ గ్రీవెన్స్‌కు ఎనిమిదేళ్ల బాలుడు.. ఎందుకో తెలుసా!

4th Class student files Complaint with Collector: సాధారణంగా కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌కు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు వారి సమస్యలపై విన్నవించుకోవడానికి వస్తుంటారు. కలెక్టర్ చొరవతో కొన్ని వెంటనే పరిష్కారమయ్యే సమస్యలు ఉంటే, కొన్ని సమయం తీసుకునే సమస్యలు ఉంటాయి. ఇవాళ గుంటూరు కలెక్టర్ గ్రీవెన్స్‌లో ఎనిమిదేళ్ల బాలుడు ప్రత్యక్షమయ్యాడు. పాఠశాల బ్యాగ్ వేసుకునని చేతిలో ఫిర్యాదు పేపర్ పట్టుకుని కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌కు వచ్చాడు. బాలుడిని చూసి అంతా షాక్ అయ్యారు. బాలుడికి వచ్చిన కష్టమేంటి? కలెక్టర్ దగ్గరకు ఎందుకు వచ్చాడని రకరకాల ప్రశ్నలు వారి బుర్రల్లో మెదిలాయి.
బాలుడు వచ్చింది తన సమస్యపై కాదు. తన తల్లి సమస్యపై కలెక్టరేట్‌కు వచ్చాడు. రోడ్డు మీద చిన్న వ్యాపారం చేసుకునే తన తల్లికి కష్టం వచ్చింది. ఇది బాలుడిని ఎంతో కలచివేసింది. దీంతో కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకొచ్చాడు.
వివరాల్లోకి వెళ్తే.. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద తన తల్లి టిఫిన్ బండి నిర్వహించింది. అధికారులు టిఫిన్ బండిని మూయించారు. దీంతో తల్లి మనస్థాపానికి గురైంది. బతుకుదెరువుకు ఆధారంగా ఉన్న టిఫిన్ బండి మూతపడడంతో ఏం చేయాలో తోచని పరిస్థితిలోకి వెళ్లిపోయింది. తల్లి ప్రవర్తనను గమనించిన బాలుడు కలెక్టర్‌ను కలిసేందుకు కలెక్టరేట్‌కు వచ్చాడు. నాలుగో తరగతి చదువుతున్న బాలుడు యశ్వంత్. యశ్వంత్ సమస్యను విన్న కలెక్టర్ నాగలక్ష్మి వెంటనే బాలుడి తల్లి టిఫిన్ బండి పెట్టుకునేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. కలెక్టర్ స్పందనపై ఆనందం వ్యక్తం చేస్తూ బాలుడు తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. కలెక్టర్ దగ్గరకు వచ్చిన బాలుడి ధైర్యాన్ని చూసి అంతా ఔరా! అంటున్నారు.