AP Government: ఆ సంస్థకు షాక్.. జల విద్యుత్ ప్రాజెక్టు రద్దు చేసిన ఏపీ ప్రభుత్వం

AP Government Cancels ArrowInfra Pumped Storage Hydroelectric Project: ఏపీలోని నంద్యాల జిల్లాలో అరోఇన్‌ఫ్రా పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్ ప్రాజెక్టును ప్రభుత్వం రద్దు చేసింది. 800 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి లక్ష్యంతో నిర్మించతలపెట్టిన ప్రాజెక్టుకు నిర్మాణ కేటాయింపులను రద్దు చేసింది. ఈ మేరకు సీఎస్ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. డీపీఆర్ పూర్తి చేయడంలో జాప్యం దృష్ట్యా కేటాయింపులు రద్దు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మరోవైపు సత్యసాయి జిల్లాలో 83 మెగావాట్ల విండ్ సోలార్ హైబ్రిడ్ పవర్ ప్రాజెక్టుకు ఏపీ సర్కారు అనుమతిచ్చింది. కనగానపల్లి మండలంలో బెర్రీ అలైస్ సంస్థ ప్రాజెక్టును చేపట్టనుంది. ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద సర్కారు ప్రోత్సాహకాలు ప్రకటించింది. అదానీ గ్రూప్‌నకు చెందిన రెండు హైడ్రో పవర్ ప్రాజెక్టుల సామర్థ్యం పెంపునకు అనుమతిచ్చింది. అల్లూరి జిల్లా పెదకోటలోని అదానీ ఎనర్జీ-4 అభ్యర్థన మేరకు ప్రాజెక్టు సామర్థ్యాన్ని 1000 నుంచి 1800 మెగావాట్లకు పెంచుతూ సర్కారు నిర్ణయం తీసుకుంది.
విజయనగరం, అనకాపల్లి జిల్లాల పరిధిలోని రైవాడ పంప్ట్ స్టోరేజ్ సామర్థ్యాన్ని పెంచింది. అదానీ హైడ్రో ఎనర్జీ వన్ లిమిటెడ్ అభ్యర్థనను ఏపీ సర్కారు ఆమోదించింది. కడప జిల్లా గండికోట అదానీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచింది. దీని సామర్థ్యాన్ని 1000 నుంచి 1800 మెగావాట్లకు పెంచేందుకు అనుమతిచ్చింది. అదానీ ‘రెన్యూవబుల్ ఎనర్జీ 51’ ప్రతిపాదనను ఇంధనశాఖ ఆమోదించింది. ఈ మేరకు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు.