Chandrababu: పర్యాటక శాఖకు సలహాదారుగా ఉండండి: రామ్‌దేవ్‌ను కోరిన సీఎం చంద్రబాబు

AP CM Chandrababu: యోగా డే నిర్వహణలో గిన్నిస్ రికార్డు సాధించామని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. యోగా డేను ఘనంగా నిర్వహించడాన్ని ప్రధాని మోదీ ప్రశంసించారని చెప్పారు. శుక్రవారం విజయవాడలో నిర్వహించిన టూరిజం కాంక్లేవ్ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. ఆధ్యాత్మికవేత్త బాబా రామ్‌దేవ్ సమాజానికి సేవ చేస్తున్నారని కొనియాడారు. పర్యాటక శాఖకు సలహాదారుగా ఉండాలని రామ్‌దేవ్‌ను కోరారు. ఏపీలో పర్యాటకం అభివృద్ధి చెందేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. ఆగస్టు 15లోగా అన్ని సేవలను ఆన్‌లైన్‌లో అందిస్తామన్నారు.
టెంపుల్ టూరిజం మరింత అభివృద్ధి కావాలి..
భవిష్యత్ అంతా పర్యాటక రంగానిదేనని ఎప్పుడో చెప్పానట్లు సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. టెంపుల్ టూరిజం మరింత అభివృద్ధి కావాలని కోరారు. ఏపీకి అద్భుతమైన సముద్ర తీరం ఉందని, అనేక చోట్ల అందమైన అటవీ ప్రాంతం ఉందని చెప్పారు. పాపికొండలు, కోనసీమ, హార్సిలీ హిల్స్‌ను మరింత అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. మదనపల్లె దేశంలోనే గొప్ప వెల్‌నెస్ సెంటర్‌గా మారాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఏపీలో వెల్‌నెస్ సెంటర్లు ఏర్పాటు చేయాలని బాబా రామ్‌దేవ్‌ను కోరారు. యోగా, మెడిటేషన్ గేమ్‌ఛేంజర్ కానున్నాయి.
ప్రతి రంగంలో సంపద సృష్టించాలనేదే నా లక్ష్యం..
పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించిన ప్రభుత్వం తమదేనని స్పష్టం చేశారు. ప్రతి రంగంలో సంపద సృష్టించాలనేదే తన లక్ష్యమన్నారు. పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించిన ఘనత కూడా తమదేనన్నారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలని పిలుపునిచ్చారు. విదేశాల్లో ఉన్న భారతీయుల్లో 35 శాతం తెలుగువాళ్లే ఉన్నారని గుర్తుచేశారు. ఎక్కువ ఆదాయం పొందుతున్నది కూడా తెలుగువాళ్లే అన్నారు. దశాబ్దాల కింద భారత్‌లో ఐటీ అభివృద్ధి గురించి బిల్‌గేట్స్‌తో చర్చించానని చెప్పారు. తర్వాత ఆయన హైదరాబాద్‌లో ఐటీ కేంద్రం ఏర్పాటు చేశారన్నారు. దేశంలో 1991 తర్వాత పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలు తెచ్చారని, తర్వాత భారత్‌లో ఐటీ బాగా అభివృద్ధి చెందిందన్నారు.
దేశీయంగా తయారైన ప్రతి ఉత్పత్తిలో అంతర్జాతీయ స్థాయి ఉండాలని కోరారు. సరైన సమయానికి సరైన వ్యక్తి మనకు మోదీ ప్రధానిగా ఉన్నారని పేర్కొన్నారు. మన దేశంలో బిలియనీర్లు బాగా పెరుగుతున్నారని, పేదవాళ్లను పైకి తెచ్చేందుకు అందరం కృషి చేయాలని కోరారు. సరైన ప్రణాళికతో ముందుకెళ్తే ప్రజలే గొప్ప సంపదగా మారతారని ఆకాంక్షించారు. టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయని యువత భయపడుతున్నారని, నైపుణ్యం పెంచుకొని స్మార్ట్ వర్క్ చేస్తే ఉద్యోగాలు ఎక్కడికి పోవని చంద్రబాబు తెలిపారు.