CM Chandrababu : మూడు రాజధానుల పేరుతో మూడుముక్కలాట : సీఎం చంద్రబాబు

CM Chandrababu : ఏపీకి రూ. 6.5లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దీంతో దాదాపు 5లక్షల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, పేరాబత్తుల రాజశేఖరం విజయం సాధించిన సందర్భంగా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు.
విశాఖ రైల్వేజోన్ పూర్తిచేసుకున్నాం..
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కూటమి అభ్యర్థుల విజయం ఏపీ పునర్నిర్మాణానికి సంజీవనిగా పనిచేస్తుందని చెప్పారు. గతంలో మూడు రాజధానుల పేరుతో మూడుముక్కలాట ఆడారని ఆరోపించారు. అసాధ్యం అనుకున్న విశాఖ స్టీల్‌ప్లాంట్ సుసాధ్యమైందని చెప్పారు. విశాఖ రైల్వేజోన్ పూర్తిచేసుకున్నామన్నారు. రూ.1.9లక్షల కోట్లతో ఎన్టీపీసీ, జెన్‌కో ప్లాంటు ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. ఎప్పడూ ఎన్నికలు వచ్చినా అందరూ కలిసి పనిచేయాలని సూచించారు.
అందరూ కలిసి పనిచేయాలి..
అందరూ కలిసి పనిచేసినప్పుడే ఫలితాలు అనూహ్యంగా వస్తాయన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మించాలని టీడీపీ కార్యకర్తలకు పిలుపునిచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కలిసినట్లు చెప్పారు. స్వప్రయోజనాలు లేవని, మూడు పార్టీలు కలిసి పనిచేశామన్నారు. మూడు పార్టీల ఐకమత్యం శాశ్వతంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. ఒకరికొకరు గౌరవించుకునే సంప్రదాయానికి శ్రీకారం చుట్టాలన్నారు. మూడు పార్టీలు ప్రజల్లో ఉంటే భవిష్యత్‌లో ఏ పార్టీకి అవకాశం ఉందన్నారు. త్వరలో తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని సీఎం చంద్రబాబు వివరించారు.
గోదావరి ఒక్కటే తెలుగు ప్రజలకు శ్రీరామరక్ష
గోదావరి నీళ్లు పోలవరం నుంచి బనకచర్లకు తీసుకెళ్తానని చెప్పారు. సముద్రంలోకి వెళ్తే నీళ్లు తీసుకెళ్తామంటే ఓ పార్టీ రాజయకీయం చేస్తోందని మండిపడ్డారు. తెలుగుజాతి కోసం పెట్టిన పార్టీ టీడీపీ అన్నారు. తనకు రెండు ప్రాంతాలు సమానమని పేర్కొన్నారు. సముద్రంలోకి వృథాగా పోయే నీళ్లను కరవు ప్రాంతాలకు తీసుకెళ్తానంటే కొంతమంది రాజకీయం చేస్తున్నారని తెలిపారు. ఒకరు మాట్లాడితే తాము వెనకబడిపోతామేమోనని మరికొందరు మాట్లాడుతున్నారన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించలేదు..
కాళేశ్వరం ప్రాజెక్టును తాను ఎప్పుడూ వ్యతిరేకించలేదన్నారు. గోదావరిపై ప్రాజెక్టులు కట్టాలని, నీళ్లు తీసుకుపోవాలని, గోదావరి ఒక్కటే తెలుగు ప్రజలకు శ్రీరామరక్ష అన్నారు. సముద్రంలోకి వెళ్లే నీళ్లు కరువు ప్రాంతానికి తీసుకెళ్తే ఎవరూ బాధపడనక్కర్లేదన్నారు. గంగ, కావేరి నదులను అనుసంధానం చేయాలన్నారు. అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనతో ప్రధాని మోదీ దేశాన్ని నడిపిస్తున్నారని కొనియాడారు. తెలుగు జాతిని అగ్రగామిగా చేయాలన్నదే తన లక్ష్యమన్నారు. పీవీ నరసింహారావు దేశం దిశ మార్చే సంస్కరణలు తీసుకొచ్చారని గుర్తుచేశారు. జాతి, రాష్ట్ర ప్రయోజనాలే తన ప్రయోజనాలు అని సీఎం అన్నారు.