Heavy Rains: వచ్చే ఐదురోజులు పలు రాష్ట్రాల్లో భారీనుంచి అతిభారీ వర్షాలు
నైరుతి రుతు పవనాల ప్రభావంతో దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్థవ్యవస్థంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లన్నీ జలమయంగా మారాయి. పలు చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి.
Heavy Rains: నైరుతి రుతు పవనాల ప్రభావంతో దేశ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం అస్థవ్యవస్థంగా మారింది. తెలుగు రాష్ట్రాల్లో వానలు దంచికొడుతున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లన్నీ జలమయంగా మారాయి. పలు చోట్ల భారీ వృక్షాలు నేలకొరిగాయి. ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
నిర్మల్ జిల్లా ముధోల్‌లో 20.3 సెంటీమీటర్ల వాన కురిసింది. 24 గంటల వ్యవధిలో ఇంత భారీ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం గత పదేళ్లలో ఇదే తొలిసారని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. 19 జులై 2013న రామగుండంలో 17.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు అదే రికార్డు కాగా, ఇప్పుడది తుడుచిపెట్టుకుపోయింది. రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు పొంగిపొర్లుతూ ప్రమాదకరంగా మారాయి. కొన్ని జిల్లాల్లో చెరువులు మత్తడి పోస్తున్నాయి. రానున్న అయిదు రోజుల్లో గోదావరికి భారీ వరదలు వచ్చే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రోడ్లపై నీరు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే, పలుచోట్లు రోడ్లు కోతకు గురికాగా, మరికొన్ని చోట్ల ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఇక మరో 3 రోజుల్లో బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, అదే జరిగితే మళ్లీ భారీ వర్షాలు తప్పవని అధికారులు తెలిపారు.
ఏపీలోనూ విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు భారీ వర్షాలతో తడిసి ముద్దవుతున్నాయి. మిగిలిన ఉత్తరాంధ్ర జిల్లాలు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాష్ట్రంలో సగటున 14.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. విజయనగరం జిల్లాలో అత్యధికంగా 67.2 మిల్లీమీటర్లు సగటు వర్షపాతం నమోదైంది. శ్రీకాకుళం జిల్లాలో 37.6, పార్వతీపురం మన్యంలో 31.4, అల్లూరి సీతారామరాజు 34, విశాఖ జిల్లాలో 32.5, అనకాపల్లి జిల్లాలో 21.7, కాకినాడ జిల్లాలో 13.4, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 12.5, తూర్పుగోదావరి 20.9, పశ్చిమగోదావరి జిల్లాలో 17.1, ఏలూరు జిల్లాలో 15.4, కృష్ణాలో 19.8, ఎన్టీఆర్ జిల్లాలో 26.4, గుంటూరు జిల్లాలో 15, పల్నాడు జిల్లాలో 16.9 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది.
విజయనగరం జిల్లా మెరకముడిదాంలో అత్యధికంగా 22 సెంటీమీటర్ల వర్షం పడింది. గరివిడిలో 170.6, చీపురుపల్లిలో 123.6, శ్రీకాకుళం జిల్లా లావేరులో 123.2, విజయనగరం జిల్లా దత్తిరాజేరులో 122.6, తెర్లాంలో 102.6, గజపతినగరంలో 99.6, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో 120.1, రణస్థలంలో 113.2, పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంటలో 98.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.
మరోవైపు ఉత్తరాఖండ్, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక, మిజోరాం, కేరళ రాష్ట్రాల్లో సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదైంది. చాలా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. వరదలు పొటెత్తడంతో పలువురు గల్లంతయ్యారు. కొండచరియలు, వరదల కారణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతుంది
రాబోయే ఐదు రోజుల పాటు పలు రాష్ట్రాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, చండీగఢ్, రాజస్థాన్ రాష్ట్రాలకు రెడ్ అలర్డ్ జారీ చేశారు. ఈ ఐదు రోజుల్లో మూడు రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయన్నారు. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో రెడ్ అలర్ట్ కొనసాగుతోంది.