Trump tariffs : యాపిల్‌కు డొనాల్డ్ ట్రంప్ గుడ్‌న్యూస్.. సుంకాల నుంచి ఫోన్లు, కంప్యూటర్లకు మినహాయింపు

Trump tariffs : టారిఫ్‌ల విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతీకార సుంకాల నుంచి స్మార్ట్‌ఫోన్లు, కంప్యూటర్లు, సెమీ కండక్టర్లను మినహాయించారు. ఈ మేరకు యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ తాజాగా మార్గదర్శకాలను జారీచేసింది. దీంతో యాపిల్, శాంసంగ్ వంటి పెద్దపెద్ద కంపెనీలతో పాటు అమెరికాలోని వినియోగదారులకు భారీ ఊరట లభించి నట్లయ్యింది.
ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు కొనుగోలు..
చైనా మినహా మిగిలిన ఇతర దేశాలపై వేసిన సుంకాలను ఇటీవల ట్రంప్ వాయిదా వేశారు. చైనాపై మాత్రం 145 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. అందుకు ప్రతిగా చైనా కూడా అమెరికా ఉత్పత్తులపై 125 శాతం సుంకం వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో రెండుదేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికాకు చెందిన యాపిల్ వంటి సంస్థలు చైనాలో ఐఫోన్లు, ఇతర యాపిల్ ప్రొడక్టులను అధికంగా ఉత్పత్తి చేస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ చర్యల వల్ల అమెరికాలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు పెరుగుతాయన్న ప్రజలు ఆందోళన చెందగా, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కొనుగోలుకు స్థానికంగా ఎగబడ్డారు.
కొన్ని వస్తువులకు సుంకాల నుంచి మినహాయింపు..
స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, హార్డ్ డ్రైవ్‌లు, కంప్యూటర్ ప్రాసెసర్లు, మెమొరీ చిప్‌లు, సెమీ కండక్టర్లు, సోలార్ సెల్స్, ఫ్లాట్ టీవీ డిస్‌ప్లేలు తదితర వస్తువులు ప్రతీకార సుంకాల నుంచి మినహాయింపు పొందిన జాబితాలో ఉన్నాయి. చైనాపై విధించిన 145 శాతం సుంకం వీటికి వర్తించదు. వీటికి వేర్వేరు సుంకాలు వర్తిస్తాయని కస్టమ్స్ విభాగం పేర్కొంది. వాస్తవానికి ప్రతీకార సుంకాల నుంచి మినహాయింపు పొందాలంటే ఆయా ఉత్పత్తులను అమెరికాలో తయారు చేయాల్సి ఉంటుంది. దీనికి కొన్నేళ్ల సమయం పడుతుంది. ఈ క్రమంలోనే వాటిని మినహాయిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మరోవైపు ప్రతీకార సుంకాల ప్రకటన అనంతరం అత్యధికంగా యాపిల్ కంపెనీ నష్టపోయింది. తాజా నిర్ణయం కంపెనీకి గుడ్‌న్యూస్ అనే చెప్పాలి.