Canada–India relations: కెనడాలో సిక్కుల టార్గెట్ కిల్లింగ్.. ఇండియా ఇంటెలిజెన్స్ సంస్థ రా సీనియర్ అధికారుల హస్తం ఉందా?
Canada–India relations: కెనడాలో సిక్కుల టార్గెట్ కిల్లింగ్ వెనుక కేంద్రహోంమంత్రి అమిత్ షా.. ఇండియా ఇంటెలిజెన్స్ సంస్థ రా సీనియర్ అధికారుల హస్తం ఉందా? ప్రస్తుతం ఇరు దేశాల మధ్య దౌత్యసంబంధాలు పాతాళానికి పడిపోవడానికి కారణం అమిత్ షానేనా? అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్ట్ మాత్రం కెనడాలో ఖలిస్తానీ టెర్రరిస్టులను చంపడానికి కేంద్రమంత్రే కారణమంటూ ఓ కథనాన్ని ప్రచురించింది. వివరాలేంటో ప్రత్యేక కథనంలో చూద్దాం.
కెనడాకు.. ఇండియాకు మధ్య ప్రస్తుతం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి వచ్చాయి సంబంధాలు. దీనికి కారణం కెనడాలో ఖలిస్తానీ టెర్రరిస్టులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపుతున్నారు. దీని వెనుక ఇండియా హస్తం ఉందని కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపిస్తున్నారు. దీనికి బలమైన సాక్ష్యాలు చూపించాలని ఇండియా గత కొన్నిసంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తోంది.
ఖలిస్తానీ టెర్రరిస్టు హర్దీప్‌సింగ్ నిజ్జర్‌ను కెనడాలో ఓ గురు ద్వారా వద్ద గుర్తు తెలియని వ్యక్తులు చంపిన తర్వాత నుంచి కెనడా ప్రధానమంత్రి నిజ్జర్ హత్యకు ఇండియాను బాధ్యుడిని చేస్తున్నారు. అయితే గత కొన్ని రోజుల నుంచి అంతంత మాత్రంగా ఉన్న సంబంధాలు.. గత సోమవారం నాడు మరింత క్షీణించాయి. ఇరు దేశాలు తమ దౌత్యవేత్తలను దేశం నుంచి బహిష్కరిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి.
అయితే కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో సిక్కుల ఓట్ల కోసం ఇండియాతో వైరానికి సిద్ద పడ్డారు. వచ్చే ఏడాది కెనడాలో ఎన్నికలు జరగనున్నాయి. అయినా రేటింగ్ దారుణంగా పడిపోయింది. దీంతో సిక్కుల ఓట్లను దండుకోవడానికి పన్నులాంటి టెర్రరిస్టుల ఒత్తిడికి గురై ఆయన ఇండియాపై లేని పోని ఆరోపణలు చేసి ప్రపంచదేశాల ముందు ఇండియాను దోషిగా నిలబెట్టాలని చూస్తున్నారు.
అయితే తాజాగా అమెరికాకు చెందిన వాషింగ్టన్ పోస్ట్ కూడా కెనడాలో అల్లకల్లోం సృష్టించడానికి కేంద్రమంత్రి అమిత్ షాతో పాటు ఇండియాకు చెందిన గూడచార సంస్థ రా అధికారులు.. కెనడాలో కోవర్టు ఆపరేషన్లు నిర్వహిస్తోందని తాజాగా ఓ వార్తను ప్రచురించింది. అందుకే కెనడా ప్రభుత్వ అధికారులు వీటిని గుర్తించి కెనడాలో ఆరుగురు దౌత్యవేత్తలను బహిష్కరించిందని.. దేశంలో హింసకు ఈ అధికారులు ప్రోత్సహించారని కెనడా అధికారులు ఆరోపిస్తున్నారు.
కెనడా అధికారులు తమకు అందిన ఖచ్చితమైన సమాచారాన్ని ఇండియాకు చెందిన నేషనల్ సెక్యురిటి సలహాదారు అజిత్ దోవాల్‌తో పంచుకున్నారు. హోంమంత్రి అమిత్ షా, సీనియర్ రా అధికారులు కెనడాలో ఉన్న ఖలిస్తానీకి చెందిన కీలకమైన నేతలపై దాడులు చేయాలని ఆదేశించారని, దేశంలో శాంతి భద్రతలకు భంగం కల్పించాలని కుట్ర పన్నారని కెనడా అధికారులు దోవాల్‌కు చెప్పినట్లు వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది.
ఇండియా దౌత్యవేత్తల సంభాషణలను రికార్డు చేసినట్లు కెనడా అధికారులు చెప్పారు. ఇండియాలో ఉన్న సీనియర్ అధికారులతో పాటు రా సీనియర్ అధికారులు మధ్య జరిగిన సంభాషణను కూడా పోస్ట్ ప్రస్తావించింది. అయితే ఇక్కడ సీనియర్ అధికారి అంటే అమిత్ షాగా గుర్తించారు. అయితే వాషింగ్టన్ పోస్ట్ దీని గురించి భారత ప్రభుత్వాన్ని వివరణ కోరగా ఇండియా నుంచి ఎలాంటి స్పందన లేదని కూడా వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.
ఇదిలా సోమవారం నాడు కెనడా ప్రభుత్వం ఇండియాకు చెందిన ఆరుగురు దౌత్యవేత్తలను దేశ బహిష్కరణ చేసింది. వీరంతా కెనడాలో జరిగిన హింసలో కీలక పాత్ర పోషించారని చెబుతున్నారు. కాగా న్యూఢిల్లీ మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తూ వస్తోంది. ఇండియా మాత్రం కెనడా తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఇలాంటి ఆరోపణలు చేస్తోందని మండిపడింది. దీనికి కౌంటర్‌గా ఇండియా కూడా ఆరుమంది కెనడాకు చెందిన దౌత్యవేత్తలను దేశం నుంచి బహిష్కరించింది. ఈ నెల 19వ తేదీ వరకు గడువు ఇచ్చి దేశం నుంచి వెళ్లిపోవాల్సింది ఆదేశించింది.ఇంతకు ఇండియాకు.. కెనడాకు మధ్య దౌత్యవేత్తల బహిష్కరణకు పరిస్థితులు రావడానికి గల కారణాలేంటో చూద్దాం.
కెనడాకు చెందిన రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీస్ బహిరంగంగానే కెనడాలో జరిగిన హింస వెనుక భారత ప్రభుత్వ ఏజంట్ల హస్తం ఉందని ఆరోపించింది. కెనడా పోలీసులు ఈ ఆరోపణలు గుప్పించిన వెంటనే కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో కూడా ఈ నెల 12న సింగపూర్‌లో అజిత్ దోవాల్ కెనడాకు చెందిన ఉన్నతాధికారితో సమావేశం అయినప్పుడు కెనడాలో జరుగుతున్న హింస వెనుక భారతప్రభుత్వం హస్తం ఉందని సాక్ష్యాలతో సహా ఇచ్చాడని ట్రూడో చెప్పుకొచ్చారని వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.
కెడడా అధికారులు తమ వద్ద ఉన్న కీలక సమాచారం … కెనడాలో జరుగుతున్న హింస వెనుక అమిత్ షా హస్తం ఉందని సాక్ష్యాలతో సాహా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవాల్‌కు గత శనివారం నాడు సింగపూర్‌లో జరిగిన సమావేశంలో అందజేశారు.కాగా దోవాల్‌తో జరిగిన సమావేశంలో ట్రూడోకు చెందిన జాతీయ భద్రతా సలహాదారు నథాలీ డ్రౌయిన్, డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ డేవిడ్ మారిసన్‌తో పాటు రాయిల్ మౌంటెండ్ పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇక కెనడాకు చెందిన రాయల్ మౌంటెడ్ పోలీసులు మాత్రం కెనడాలో సిక్కులపై జరుగుతున్న దాడుల వెనుక బిష్ణోయ్ గ్యాంగ్ హస్తం ఉందని ఆరోపిస్తోంది. దీనికి వెనుక భారత ప్రభుత్వం ఏజంట్లు ఉన్నారని చెబుతోంది. కాగా బిష్ణోయ్ గ్యాంగ్‌లో కొన్ని వందల మంది సభ్యులున్నారు. 31 ఏళ్ల గ్యాంగస్టర్ గుజరాత్‌లోని సబర్మతి జైలు నుంచి తన క్రైం సిండికేట్‌ను నడుపుతున్నాడు. తాజాగా మహారాష్ర్ట మాజీ మంత్రి సల్మాన్‌ఖాన్‌కు అత్యంత సన్నిహితుడు బాబా సిద్దిఖిని ఈ నెల 12న రాత్రి అతి సమీపం నుంచి కాల్చి చంపారు. బాబా సిద్దిఖీ హత్య తర్వాత నుంచి దేశవ్యాప్తంగా లారెన్స్ బిష్ణోయ్ పేరు మారుమోగిపోతోంది.
ఇదిలా ఉండగా కెనడా మీడియాతో పాటు కెనడా మేధావులు మాత్రం ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో భారత దౌత్యవేత్తలను బహిష్కరించడాన్ని తప్పుబడుతున్నారు. ఎలాంటి సాక్ష్యాలు చూపకుండా ఖలిస్తానీ నాయకులకు లొంగిపోయి ఇండియా దౌత్యవేత్తలపై చర్యలు తీసుకోవడం మూర్ఖత్వమే అవుతుందని విమర్శించారు.
కెనడాకు చెందిన నేషనల్ పోస్ట్ సీనియర్ జర్నలిస్టు జాన్ ఇవిసన్ మాట్లాడుతూ.. ముందుగా కెనడా ప్రభుత్వం సిక్కు ఉగ్రవాదులను పెంచి పోషించింది. అటు తర్వాతా ఇండియా నుంచి వచ్చిన వారిని రాజకీయాల్లో ప్రవేశించడానికి అనుమతించింది.
ప్రస్తుతం కెనడా విదేశాంగ విధానాన్ని శాసించే స్థాయికి వారు రావడం.. వాకి ఒత్తిడికి ప్రధాని లొంగినొవడం ఏమిటని నిలదీశారు. పనిలో పనిగా కెనడాకు చెందిన రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులపై విమర్శలు గుప్పించారు. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఇండియాపై తీవ్రమైన ఆరోపణలు గుప్పించడం ఏమిటని నిలదీస్తున్నారు కెనడా మేధావులు.
మొత్తానికి ఇరుదేశాల మధ్య సంబంధాలు దాదాపు పూర్తిగా క్షీణించాయి. ట్రూడో తన రాజకీయ పబ్బం కోసం ఖలిస్తానీల ఒత్తిడికి లొంగిపోతున్నారనే టాక్ మాత్రం సర్వత్రా వినిపిస్తోంది. తాజాగా అమిత్ షాపై ఆరోపణలు గుప్పించడం మాత్రం సీరియస్ విషయమే దీన్ని ప్రభుత్వం ఎలా కౌంటర్ ఇస్తుందో వేచి చూడాల్సిందే.