Ukraine Crisis: రష్యాతో యుద్ధం.. ఉక్రెయిన్ నష్టం ట్రిలియన్ డాలర్లు
దాదాపు ఏడు నెలలుగా రష్యా తో కొనసాగుతోన్న యుద్ధంతో ఉక్రెయి న్ అతలాకుతలమవుతోంది. పుతిన్ సేనల దాడుల్లో పెద్దఎత్తున ప్రాణ, ఆస్తి నష్టాలు తప్పడం లేదు.
Ukraine: దాదాపు ఏడు నెలలుగా రష్యా తో కొనసాగుతోన్న యుద్ధంతో ఉక్రెయి న్ అతలాకుతలమవుతోంది. పుతిన్ సేనల దాడుల్లో పెద్దఎత్తున ప్రాణ, ఆస్తి నష్టాలు తప్పడం లేదు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు ఉక్రెయిన్‌కు దాదాపు ఒక ట్రిలియన్ డాలర్ల భారతీయ కరెన్సీ ప్రకారం 80 లక్షల కోట్లు మేర నష్టం వాటిల్లినట్లు జెలెన్‌స్కీ ఆర్థిక సలహాదారు ఓలెగ్ ఉస్తెంకో వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థను యుద్ధ సంక్షోభం తీవ్రంగా దెబ్బతీస్తోందన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా, ఉక్రెయిన్ దాదాపు ఒక ట్రిలియన్ డాలర్ల మేర నష్టపోయినట్లు ఆయన వెల్లడించారు. జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ‘జర్మన్ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్’ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రష్యా దాడికి ముందు ఉన్న ఉక్రెయిన్ వార్షిక జీడీపీతో పోల్చితే, ప్రస్తుత నష్టం విలువ అయిదు రెట్లు ఎక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు.
భారీఎత్తున విధ్వంసం, ప్రజలు ఇతర ప్రాంతాలకు తరలిపోవడం వంటి సమస్యలతో ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ ఇబ్బందిగా మారిందని ఉస్తెంకో తెలిపారు. అనేక వ్యాపారాలు దెబ్బతిన్నాయని పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయం సైతం.. మొదట్లో ఊహించిన దాంతో పోలిస్తే గణనీయంగా తగ్గిపోయిందన్నారు. ప్రభుత్వ వ్యయంలో భారీ కోతలు విధించినప్పటికీ, ఫిబ్రవరి నుంచి నెలకు ఐదు బిలియన్ యూరోలు సుమారు 4.9 బిలియన్ డాలర్లు లోటును ఎదుర్కొంటోందని తెలిపారు. వచ్చే ఏడాది నాటికి ఇది దాదాపు 3.5 బిలియన్ యూరోలకు తగ్గే అవకాశం ఉందన్నారు.
ఈ ఏడాది ఆర్థిక వ్యవస్థ సైతం 35 నుంచి 40 శాతం క్షీణిస్తుందని అంచనా వేస్తున్నట్లు ఆయన తెలిపారు. 1991లో స్వాతంత్ర్యం పొందినప్పటినుంచి ఇదే అత్యంత గడ్డుకాలమని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, యుద్ధం ప్రారంభమైన మొదటి రెండు వారాల్లో 100 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అప్పట్లో అంచనా వేశారు. తాజాగా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నష్టం మరింత పెరిగిందని ఆర్థిక సలహాదారు వివరించారు.