Shiva Rajkumar: అందుకే ‘కన్నప్ప’లో నటించలేదు – కన్నడ హీరో శివరాజ్ కుమార్

Shiva Rajkumar Comments on Kannappa Movie and Mohan Babu: మంచు విష్ణు లాంగ్ గ్యాప్ తర్వాత నటించిన చిత్రం ‘కన్నప్ప’. అతడి డ్రీం ప్రాజెక్ట్‌గా ఈ సినిమా రూపొందుతోంది. అత్యంత భారీ బడ్జెట్‌తో మైథలాజికల్ చిత్రంగా కన్నప్ప తెరకెక్కుతోన్న ఈ సినిమా జూన్ 27న మూవీ రిలీజ్ అవుతోంది. మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మూవీ టీం ప్రమోషన్స్ జోరు పెంచింది. మంచు విష్ణు వరుస ఇంటర్య్వూలతో బిజీ అయిపోయాడు. ఇప్పటికే చెన్నైలో ప్రెస్ మీట్ నిర్వహించి అక్కడ మీడియాలో ముచ్చటించాడు.
తాజాగా బెంగళూరులో ప్రెస్‌మీట్ నిర్వహించాడు. తన తండ్రి మోహన్ బాబుతో కలిసి మంచు విష్ణు.. బెంగళూరులో మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోహన్ బాబు, శివరాజ్ కుమార్‌లు మధ్య జరిగిన సంభాషణ బాగా ఆకట్టుకుంటోంది. ఈ మేరకు శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. “కన్నప్పలో శివుడి పాత్ర కోసం మొదట నన్నే అడిగారు. అప్పుడు డేట్స్ కుదరకపోవడంతో నటించలేకపోయాను. అంతేకాదు రెమ్యునరేషన్ సమస్య కాదు. కానీ, ఈసారి విష్ణు ఏం అడిగినాచేస్తాన”అన్నారు.
ఆ తర్వాత కన్నప్ప చిత్రం గురించి మాట్లాడుతూ.. “మా నాన్నగారు(రాజ్ కుమార్) నటించిన ‘శ్రీకాహస్తీశ్వర మహాత్మ్యం’ చిత్రంలో కన్నప్ప పాత్ర చేశాను. ఆయనతో కలిసి కన్నప్ప మూవీ చేయాలంటే మొదట భయం వేసింది. ఆ తర్వాత ఆ పాత్రపై గౌరవం ఏర్పడింది. ‘నేనిల్ల నేనిల్ల’ పాట చేస్తున్నప్పుడు కన్నప్ప రోల్‌పై మరింత ఆసక్తి పెరిగింది. ఆ సినిమా తర్వాత దాదాపు 37 ఏళ్ల తర్వాత అలాంటి కథతో విష్ణు ఈ సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. ఆయనపై గౌరవం మరింత పెరిగింది” అని చెప్పుకొచ్చారు.
ఇక మోహన్ బాబు మాట్లాడుతూ.. “కన్నడలో నటించాలనేది నా కోరిక. ఏదైనా కన్నడ సినిమాలో నటిస్తే బాగుండు అని ఎప్పుడూ అనిపించేది. అప్పట్లో అంబరీష్‌ను అడిగితే నవ్వి ఊరుకునేవారు. రాజ్‌కుమార్ గారిని అడగాలంటే ధైర్యం సరిపోయేది కాదు. అందుకే ఇప్పుడు ఆయన కుమారుడు శివరాజ్ కుమార్‌ను అడుగుతున్నా. మీ సినిమాలో ఏదైనా విలన్ పాత్రలో నాకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నా” అని అన్నారు. దీనికి శిశరాజ్ కుమార్ స్పందిస్తూ.. “మోహన్ బాబు గారు గొప్ప నటులు. నా సినిమాలో విలన్ పాత్ర అడిగారు. కానీ, నేను ఆయనకు అది ఇవ్వను. ఎందుకంటే నేను ఆయనతో ఫైట్ చేయాలనుకోవడం లేదు. అందుకే ఒక అందమైన అన్నయ్య రోల్ ఇస్తాను. హై క్వాలిటీ రోల్ అది” అని సమాధానం ఇచ్చారు.