Laya: బాలకృష్ణ కాలు తొక్కినందుకు.. సినిమాలో నుంచి తీయించేశాడు

Laya: ఈమధ్యకాలంలో సీనియర్ హీరోయిన్లు రీఎంట్రీలు ఎక్కువ అవుతున్నాయి. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించిన హీరోయిన్లు మధ్యలో కొంత గ్యాప్ తీసుకొని కొత్తగా ఇప్పుడు రీఎంట్రీలు ప్లాన్ చేసుకుంటున్నారు. తాజాగా సీనియర్ హీరోయిన్ లయ కూడా అదే పంధాలో రీఎంట్రీ ఇస్తుంది. అచ్చ తెలుగు అందం అయిన లయ.. స్వయంవరం సినిమాతో తెలుగుతెరకు పరిచయామైంది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న లయ.. సీనియర్, జూనియర్ అని లేకుండా అందరి హీరోల సరసన ఆడిపాడింది.
ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని అమెరికాలో సెటిల్ అయ్యింది. ఆ తరువాత ఆమె ఏమైంది అనేది ఎవరికి తెలియలేదు. ఇక సోషల్ మీడియా పుణ్యమా అంటూ.. లయ మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ చేస్తూ అభిమానులను అలరించింది. అలా ప్రేక్షకులకు మళ్లీ దగ్గరయ్యిన ఈ భామ.. ఇండియాకు వచ్చి మరోసారి వెండితెరపై కనిపించడానికి రెడీ అయ్యింది.
బుల్లితెరపై షోస్, జబర్దస్త్ లో కనిపిస్తున్న లయ.. నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న లయ.. నందమూరి బాలకృష్ణ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. నందమూరి బాలకృష్ణతో కలిసి లయ.. విజయేంద్రవర్మ సినిమా చేసింది.
మొదట చెన్నకేశవరెడ్డి సినిమాలో బాలయ్య చెల్లిగా లయను అనుకున్నారట. అప్పుడే తాను చెల్లి పాత్రలు చేయాలనుకోలేదని, అందుకే నో చెప్పినట్లు గతంలో చాలాసార్లు చెప్పింది. ఇక ఆ పాత్రలో దేవయాని కనిపించింది. ఆ తరువాత విజయేంద్రవర్మ సినిమాలో లయ.. బాలయ్య భార్యగా నటించింది. ఇక ఆ సినిమా షూటింగ్ లో జరిగిన ఒక ఫన్నీ ఇన్సిడెంట్ ను లయ చెప్పుకొచ్చింది.
” ఆ షూటింగ్ సమయంలో అనుకోకుండా బాలయ్య కాలు తొక్కేసాను. ఆయన బాగా సీరియస్ అయ్యారు. వెంటనే ఈ అమ్మాయిని సినిమాలో నుంచి తీసేయండి అని చెప్పారు. దీంతో నాకు ఏడుపు ఆగలేదు. అక్కడే ఏడ్చేశాను. ఆ తరువాత తెల్సింది బాలయ్య సరదాగా అన్నారని.. అది తెలియక నేను ఏడ్చాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.