Aditya 369: ఆదిత్య 369 కోసం మొదట అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా.. ?

Aditya 369: నందమూరి బాలకృష్ణ కెరీర్ లో టాప్ 10 మూవీస్ చెప్పాలంటే.. అందులో మొదటి వరుసలో ఉంటుంది ఆదిత్య 369. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా దాదాపు 34 ఏళ్ళ తరువాత రీరిలీజ్ కు రెడీ అవుతుంది. ఏప్రిల్ 4 న ఈ సినిమా రీరిలీజ్ కానుంది. మొట్ట మొదటి సైన్స్ ఫిక్షన్ కథగా తెరకెక్కిన ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను దర్శకుడు సింగీతం అభిమానులతో పంచుకున్నాడు.
నందమూరి బాలకృష్ణ డబుల్ రోల్ లో నటించిన ఆదిత్య 369 చిత్రంలో మోహిని హీరోయిన్ గా నటించింది. అయితే మొదట మోహిని స్థానంలో విజయశాంతిని అనుకున్నారట. ఆ విషయం గురించి సింగీతం మాట్లాడుతూ.. ” నేను ఈ సినిమాను హాలీవుడ్ సినిమా నుంచి కాపీ కొట్టారని చాలామంది అన్నారు. కానీ అది నిజం కాదు.
ది టైమ్ మిషన్ అనే నవలను నేను కాలేజీ రోజుల్లోనే చదివాను. అందులో కొన్ని సన్నివేశాలు నన్ను కట్టిపడేశాయి. వాటితోనే ఒక కథ చేయాలనుకున్నాను. నాలో ఉన్న భావాలను ఒకసారి ఎస్పీ బాల సుబ్రహ్మణ్యంకు చెప్పాను. ఆయన మనం చేద్దాం అని చెప్పారు. ఆ తరువాత కొంతమంది నిర్మాతలకు ఆయనే ఈ లైన్ చెప్పి నా దగ్గరకు తీసుకొచ్చారు. అయితే వారికి సైన్స్ ఫిక్షన్ కథ అర్ధం కాక నో అన్నారు. చివరికి శివలెంక కృష్ణప్రసాద్ ఓకే చెప్పారు.
మొదటి నుంచి ఈ కథకు బాలకృష్ణనే హీరో అనుకున్నాం. ఆయనకు జంటగా విజయశాంతిని అనుకున్నాం. బాలకృష్ణ కూడా సరే అన్నాడు. కానీ, ఆమె డేట్స్ ఖాళీగా లేకపోవడంతో ఆమె చేయలేకపోయింది. అప్పుడే ఒక డైరెక్టర్ మోహిని గురించి చెప్పాడు. వెంటనే ఆమెను పిలిపించి ఆడిషన్ చేసి ఓకే చేశాం. అలా విజయశాంతి ప్లేస్ లో మోహిని వచ్చింది. ఇక ప్రొఫెసర్ పాత్రకు ఎవరైతే బావుంటారా.. ? అన్నప్పుడు బాలీవుడ్ నటుడు టిన్ను ఆనంద్ గుర్తొచ్చాడు. అతను నాకు మంచి స్నేహితుడు. అతనే పర్ఫెక్ట్ అనుకోని ఆ పాత్ర చేయించాం” అని చెప్పుకొచ్చారు.
ఒకవేళ విజయశాంతి డేట్స్ ఖాళీగా ఉండి ఉంటే.. ఆమె కెరీర్ లో మరో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఉండేది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఇక ప్రస్తుతం విజయశాంతి.. అర్జున్ సన్నాఫ్ వైజయంతీ అనే సినిమాలో నటిస్తుంది. కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది. మరి ఈ సినిమాతో విజయశాంతి ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.