Published On:

Hari Hara Veeramallu: హరి హర వీరమల్లు మళ్లీ వాయిదా..? – కారణమిదేనా..!

Hari Hara Veeramallu: హరి హర వీరమల్లు మళ్లీ వాయిదా..? – కారణమిదేనా..!

Pawan Kalyan’s Hari Hara Veera Mallu again Postpone: పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హరి హర వీరమల్లు మూవీ మళ్లీ వాయిదా పడనుందా? ప్రస్తుతం సోషల్ మీడియా మొత్తం ఇదే చర్చ. ఈ మూవీ జూలైలో విడుదలయ్యే అవకాశం ఉందంటూ ప్రచారం మొదలైంది. దీనికి కారణం తెలియదు కానీ, ఈ సినిమా మళ్లీ వాయిదా పడేలా కనిపిస్తుందంటున్నారు. ఎప్పుడో ఆరేళ్ల క్రితం పవన్ కమిటైన చిత్రమిది. మూవీ స్క్రిప్ట్‌ వర్క్‌, ప్రీ ప్రోడక్షన్‌ వర్క్‌కే చాలా కాలం తీసుకుంది. ఇక అన్ని పూర్తి చేసుకుని ఫైనల్‌గా 2020లో రెగ్యూలర్‌ షూటింగ్‌ని స్టార్ట్‌ చేసింది. అప్పటి నుంచి ఈ సినిమాకు తరచూ అవాంతరాలే.

 

ఎందుకో తెలియదు సినిమా షూటింగ్‌ కంటే వాయిదాలే ఎక్కువ తీసుకుంది. ప్రముఖ దర్శకుడు క్రిష్‌ ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభించారు. కొంతభాగం చిత్రీకరణ తర్వాత ఆయన తప్పుకున్నారు. ఆ తర్వాత నిర్మాత ఏఎమ్‌ రత్నం కొడుకు జ్యోతికృష్ణ రంగంలోకి దిగాడు. ఇక ఆయన ఏపీ ఎన్నికల్లో పాల్గొని, గెలిచి డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టారు. దీంతో ఆయన కమిటైన మూడు సినిమాలు ఉంటాయా?లేదా? అన్న పరిస్థితులు నెలకొన్నాయి. కానీ, పవన్‌ మాత్రం తనను నమ్మిన దర్శక-నిర్మాతలకు ఎలాంటి నష్టం జరగకూడదని సినిమాలు పూర్తి చేస్తానని వారికి హామీ ఇచ్చారు.

 

చెప్పినట్టుగానే ఒక్కోక్కొ సినిమా షూటింగ్ పూర్తి చేశారు. ఎన్నో వాయిదాలు, అడ్డంకుల తర్వాత గత నెల ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుంది. గత మే 30న రిలీజ్‌ అన్నారు. అది వాయిదా పడింది. ఇక ఎట్టకేలకు జూన్‌ 12కి మూవీ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అయ్యింది. ఈసారి వచ్చేది పక్కా అంటూ వరుసగా అప్‌డేట్స్‌ ఇస్తుంది. మరో వారంలో తిరుపతిలో ప్రీ రిలీజ్‌, ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ని కూడా ఫిక్స్‌ చేశారు. మరోవైపు నిర్మాత ఏఎమ్‌ రత్నం మూవీ టికెట్‌ ధరలు పెంచాలని కోరుతూ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలను ఆశ్రయిస్తున్నారు.

 

మూవీ సెన్సార్‌ బోర్డుకు కూడా వెళ్లింది. కానీ, అకస్మాత్తుగా హరి హర వీరమల్లు మూవీ వాయిదా అంటూ సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది. దీనికి కారణం తెలుగు రాష్ట్రాల్లో సినిమాకు బయ్యర్లు ఇంకా దొరకలేదని, అందుకే వాయిదా వేయనున్నారనే టాక్‌ వినిపిస్తోంది. స్టార్‌ హీరో, డిప్యూటీ సీఎం సినిమాకు కూడా ఇలాంటి ఆటంకాలు తప్పలేదా? అని అంత చెవులు కొరుక్కుంటున్నారు. మరి ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే మూవీ టీం నుంచి ప్రకటన వచ్చేవరకు వేచి చూడాల్సిందే.