Pawan Kalyan: సినిమాల్లోకి అడుగుపెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు : పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Pawan Kalyan Interesting Comments: సినిమాల్లో ఇప్పటివరకు తాను పోషించిన పాత్రల్లో ఇష్టమైన క్యారెక్టర్ గురించి ప్రముఖ నటుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆసక్తికర విషయం చెప్పారు. ఇప్పటివరకు పోషించిన పాత్రల్లో పూర్తి స్థాయిలో తన మనసుకు చేరువైంది ఏదీ లేదన్నారు. ప్రతి పాత్రలో కొన్ని లక్షణాలు మాత్రమే నచ్చాయన్నారు. నిజ జీవితంలో ఎలా ఉంటానో అదేవిధంగా వెండితెరపై కనిపించాలని ఉందని చెప్పారు. కానీ, అది సినిమాల్లో సాధ్యపడకపోవచ్చన్నారు. ప్రేక్షకులు ఆ సినిమాను ఆదరించకపోవచ్చని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
నటన నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టడంపై మాట్లాడారు. తన తండ్రి వల్ల రాజకీయాలపై అవగాహన వచ్చిందని చెప్పారు. సినిమాల్లోకి అడుగుపెట్టాలని, నటుడిగా మారాలని ఎప్పుడూ అనుకోలేదన్నారు. మాదొక మధ్య తరగతి కుటుంబం అన్నారు. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి చెప్పారు. కమ్యూనిస్టు భావాలను పాటించేవారని పేర్కొన్నారు. ఆయన వల్ల మా కుటుంబ సభ్యులకు రాజకీయాలపై అవగాహన వచ్చిందన్నారు. తను అనుకోకుండా సినిమాల్లోకి అడుగుపెట్టినప్పటికీ సమాజంపైనే దృష్టి ఉండేదని చెప్పారు. ఆ ఆలోచనతోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టానని పవన్ తెలిపారు.
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేస్తూ ఒకానొక సమయంలో బాలీవుడ్‌లో మంచి సినిమాలు వచ్చేవన్నారు. ‘దంగల్’ లాంటి చిత్రాలు ఇప్పుడు రావడం లేదన్నారు. ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా కథలు అందించలేకపోతున్నారని పేర్కొన్నారు.
పవన్ ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’, సుజీత్ డైరెక్షన్‌లో ‘ఓజీ’ చేస్తున్నారు. ఈ రెండు షూటింగ్ దశలో ఉన్నాయి. పవన్ హీరోగా నటించిన ‘హరి హర వీరమల్లు’ విడుదలకు సిద్ధంగా ఉంది. క్రిష్, జ్యోతికృష్ణ రూపొందించారు. జులై 24వ తేదీన మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తోంది.