Kidnap: ముగ్గురు భారతీయులను కిడ్నాప్ చేసిన అల్ ఖైదా

Indians Kidnapped In Mali: ఆఫ్రికా దేశమైన మాలిలో ముగ్గురు భారతీయులు కిడ్నాప్ అయ్యారు. కాయెస్ ప్రాంతంలోని డైమెండ్ సిమెంట్ ఫ్యాక్టరీపై సాయుధ దుండగులు దాడిచేశారు. నిషేధిత ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా అనుబంధం ఉన్న టెర్రరిస్టులు ఈ దాడికి పాల్పడినట్టు భారత విదేశాంగశాఖ ఇవాళ వెల్లడించింది. ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ ఘటన జులై 1న జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దుండగులు సిమెంట్ ఫ్యాక్టరీపై దాడిచేసి.. అక్కడ పనిచేస్తున్న కార్మికులను బంధించారని, వారిలో ముగ్గురు భారతీయులు ఉన్నారని సమాచారం. అయితే వారి వివరాలను మాత్రం వెల్లడించలేదు. మాలి రాజధాని జమాకోలోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులు, పరిశ్రమ యాజమాన్యంతో సంప్రదింపులు చేస్తున్నట్టు తెలుస్తోంది. బంధీలను సురక్షితంగా విడుదల చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరింది. కాగా, ఈ పాల్పడింది తామేనని అల్ ఖైదా అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్ ఇస్లాం వల్ ముస్లిమిక్ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో మాలిలో ఉన్న భారతీయులంతా అప్రమత్తంగా ఉండాలని విదేశాంగ శాఖ సూచించింది.