Hit 3: అభ్కీ బార్.. అర్జున్ సర్కార్.. ట్రైలర్ వచ్చేది ఎప్పుడో చెప్పేశాడు

Hit 3: న్యాచురల్ స్టార్ నాని.. ఇప్పటివరకు ప్రేక్షకులకు ఒక పక్కింటి కుర్రాడు. క్లాస్ హీరో.. న్యాచురల్ గా నటిస్తాడు.. ఇవి మాత్రమే తెలుసు. ఏ సినిమాలో చూసినా నాని ఇలానే కనిపించాడు. ఇక దీంతో తనలోని మాస్ ను బయటపెట్టాలని నాని చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. నీట్ గా.. కూల్ బాయ్ లా, తండ్రిలా, ప్రేమికుడిలా కనిపించిన నాని.. ఇక మాస్ హీరోగా కూడా విజయాన్ని అందుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడు.
ఇందులో భాగంగానే సరిపోదా శనివారం అంటూ వచ్చాడు. ఇందులో మాస్ క్యారెక్టర్ లో నాని అదరగొట్టేశాడు. అయితే ఆ సినిమాలో రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించడంతో పూర్తిగా మాస్ హీరో క్యారెక్టర్ కి న్యాయం చేయలేకపోయాడు. కానీ ఈసారి మాత్రం అస్సలు తగ్గేదేలే.. అసలు సిసలైన నిజస్వరూపాన్ని చూపించడానికి వస్తున్నాడు.
నాని హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హిట్ 3. డైరెక్టర్ శైలేష్ కొలను.. హిట్ ప్రాంచైజీతో టాలీవుడ్ లో ఒక సరికొత్త పంథాను మొదలుపెట్టాడు. హిట్ సిరీస్ లోనే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్స్ తీస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇప్పటికే హిట్.. విశ్వక్ సేన్, హిట్ 2 అడివి శేష్ తో తెరకెక్కించి హిట్స్ అందుకున్న శైలేష్.. ఇప్పుడు హిట్ 3 నానితో తెరకెక్కించి రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు.
హిట్ 3 నుంచి ఇప్పటివరకు రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడమే కాకుండా భారీ అంచనాలను రేకెత్తించాయి. మే 1 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేస్తూ.. ట్రైలర్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.
అభ్కీ బార్.. అర్జున్ సర్కార్ అంటూ సాగిన ఈ సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. అర్జున్ సర్కార్ అనే ఒక పోలీసాఫీసర్ క్యారెక్టర్ ను ఈ సాంగ్ లో చూపించారు. ఇతడికి మానవత్వం లేదని, మనుషుల జీవితం అంటే లెక్కే లేదని.. కర్కశుడు అంటూ చెప్పుకొచ్చారు. లిరిక్స్ లో వచ్చే ప్రతి లైన్ కి అర్జున్ సర్కార్ న్యాయం చేశాడు. అసలు సిసలైన రాక్షసుడుగా నాని కనిపించాడు. విలన్స్ ను వేటాడి చంపడం కానీ, ఇన్వెస్టిగేషన్ చేయడం కానీ నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.
కృష్ణకాంత్ లిరిక్స్ అందించగా.. అనురాగ్ కులకర్ణి తన బేస్ వాయిస్ తో ఆలపించి అలరించాడు. మంచి మంచి మెలోడీలు అందించిన మిక్కీ జే మేయర్ నుంచి ఇలాంటి ఒక వైలెంట్ సాంగ్ ను అస్సలు ఊహించలేదు. ఇక సాంగ్ చివర్లో ఏప్రిల్ 14 న హిట్ 3 ట్రైలర్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. మరి ఈ వైలెంట్ ఆఫీసర్.. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రచ్చ చేస్తాడో చూడాలి.