TSPSC Leak: ప్రశ్నపత్రం లీకేజీ.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు
TSPSC Paper Leak: ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం వేడెక్కుతోంది. సిట్ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆక్టోబర్ నుంచి ఈ దందా సాగుతున్నట్లు సిట్ అధికారులు తేల్చారు. అయితే మరికొన్ని విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.
TSPSC Leak:ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం వేడెక్కుతోంది. సిట్ విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆక్టోబర్ నుంచి ఈ దందా సాగుతున్నట్లు సిట్ అధికారులు తేల్చారు. అయితే మరికొన్ని విషయాలు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి.
లీకేజీలో మరికొందరు! (TSPSC Paper Leak)
టీఎస్ పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం వేడెక్కుతోంది. ఈ లీకేజీలో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. గ్రూప్-1 ప్రశ్నపత్రాన్ని రాజశేఖర్‌రెడ్డి ముఠా అనేక మందికి అమ్మినట్లు సిట్ భావిస్తోంది. దీంతో 100 కంటే ఎక్కువ మార్కులు వచ్చిన గ్రూప్-1 అభ్యర్థుల జాబితాను సిట్ సిద్ధం చేస్తోంది. దీంతో ఇందులో అనుమానితులను విచారించనుంది. విదేశాల్లో ఉన్నవారిని సైతం పిలిచి విచారించనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం గ్రూప్ 1 ప్రశ్న పత్రం ఎవరెవరికి అందిందనే విషయం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తోంది.
గ్రూప్ 1 లో 100కు పైగా మార్కులు సాధించిన అభ్యర్థుల జాబితా రూపొందించిన సిట్.. వారిని విచారించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
ఓ వైపు సైబర్ ఫోరెన్సిక్ నిపుణులు నిందితుల ఫోన్లు, ఇతర డిజిటల్ ఉపకరణాలను జల్లెడ పడుతుండగా.. మరోవైపు సిట్‌లోని ప్రత్యేక బృందం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తోంది.
ఒక్క పరీక్ష నుంచి.. ఏడు పరీక్షల దాకా
ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం ఒక్క పేపర్ నుంచి ఏడు పేపర్ల దాకా వెళ్లింది. టౌన్‌ప్లానింగ్ పరీక్ష ప్రశ్నపత్రంతో మొదలైన లీకేజీ ప్రభావం చివరకు గత అక్టోబరు నుంచి పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన అన్ని పరీక్షలపై పడింది. మొత్తం ఏడు పరీక్షల్లో నాలుగింటిని కమిషన్ రద్దు చేసింది. కాన్ఫిడెన్షియల్ రూమ్ లో నుంచి ప్రశ్న పత్రాలను రాజశేఖర్‌రెడ్డి అక్టోబర్ నుంచి తస్కరించినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడి కావడమే ఇందుకు కారణం. ఈ పరీక్షల్లో గ్రూప్-1 ప్రధానమైంది. అక్టోబరు 16న ఈ పరీక్ష నిర్వహించగా అంతకు ముందే రాజశేఖర్ రెడ్డి కాన్ఫిడెన్షియల్ విభాగంలో ఉన్న కంప్యూటర్ను యాక్సెస్ చేశాడు. విషయం నిర్ధారణ అయిన తర్వాతే గ్రూప్-1 పరీక్షను రద్దుచేశారు.
తప్పుదారి పట్టించేందుకు యత్నం..
ఈ కేసులో పోలీసులను తప్పుదారి పట్టించేందుకే.. నిందితులు తొలుత ఏఈ, టౌన్‌ప్లానింగ్ ప్రశ్నపత్రం మాత్రమే లీక్ చేసినట్లు చెప్పారు.
సిట్ దర్యాప్తులో గ్రూప్-1తో పాటు ఇతర పరీక్షల ప్రశ్నపత్రాలు కూడా బయటకు వచ్చినట్లు తేలడంతో వాటిద్వారా ఎవరెవరు లబ్ధి పొందారన్నది ఆరా తీస్తున్నారు.
ఇప్పటికే గ్రూప్ 1 లో వందకుపైగా మార్కులు సాధించిన వారి జాబితాను రూపొందించారు.
జాబితాలో ఉన్నవారికి, రాజశేఖర్‌రెడ్డి, ప్రవీణ్‌లకు మధ్య ఏమైనా ఫోన్ సంభాషణలు జరిగాయా, ఛాటింగ్ చేశారా? అన్న విషయాలను నిర్ధారించుకుంటున్నారు.
దీనికోసం ప్రవీణ్, రాజశేఖర్‌రెడ్డి ఫోన్లలో అక్టోబరు నుంచి వాట్సప్ ఛాటింగ్ వివరాలను తెప్పించుకుంటున్నారు. వీరిద్దరూ ఆరు నెలలుగా ఎవరెవరితో సంప్రదింపులు జరిపారు… వారిలో గ్రూప్-1 ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారెవరున్నారు? తదితర వివరాలన్నీ సైబర్ ఫోరెన్సిక్ నిపుణులు సేకరిస్తున్నారు. దీంతోపాటు అనుమానిత అభ్యర్థుల బ్యాంకు లావాదేవీలను కూడా వడ పోస్తున్నారు.
లబ్ధిపొందిన వారిని గుర్తించి వారందరిపైనా కేసులు పెట్టడం ఖాయమని ఓ అధికారి వ్యాఖ్యానించారు.