Published On:

Pawan Kalyan : కొత్త విధానంతో ‘రేషన్‌’ అక్రమ రవాణాకు అడ్డుకట్ట : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్

Pawan Kalyan : కొత్త విధానంతో ‘రేషన్‌’ అక్రమ రవాణాకు అడ్డుకట్ట : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్

AP Deputy CM Pawan Kalyan : జూన్‌ 1వ తేదీ నుంచి నిరుపేదలకు రేషన్‌ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ చేయడమే కూటమి సర్కారు లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. ప్రతినెలా ఒకటో తేదీ నుంచి 15 వరకు ఉదయం 8 నుంచి 12 వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు రేషన్ దుకాణాలు తెరిచి ఉంటాయని పేర్కొన్నారు.

 

పేదలకు నిత్యావసర సరుకులు అందించే రేషన్ షాపులను గత వైసీపీ ప్రభుత్వం మూసివేసిందన్నారు. ఇంటింటికీ అందిస్తామని రూ.1600 కోట్లతో వాహనాలు కొనుగోలు చేశారని తెలిపారు. ఇంటింటికీ ఇవ్వడం మానేసి నెలలో ఒకటి రెండు రోజులు మాత్రమే జంక్షన్లలో వాహనం నిలిపి ఇవ్వడంతో ఎంతో మంది పేదలు సరుకులు అందక ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. వాహనం ఎప్పుడు వస్తుందో తెలియక రోజువారీ పనులు మానుకొని, చిరుద్యోగాలకు సెలవులు పెట్టుకోవాల్సి వచ్చేదన్నారు.

 

మిగిలిన రేషన్‌ బియ్యం, సరుకులను అక్రమంగా తరలిస్తున్న విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయిలో విచారణ జరిపిందన్నారు. వేలాది టన్నుల అక్రమ బియ్యాన్ని కాకినాడ, విశాఖపట్నం పోర్టుల్లో పట్టుకుందన్నారు. అక్రమ రవాణాను అరికట్టేందుకు రేషన్ షాపుల ద్వారా పేదలకు నిత్యావసరాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. దివ్యాంగులు, 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి వద్ద నిత్యావసర సరుకులు అందించే సౌకర్యాన్ని ప్రభుత్వం కల్పించిందని పవన్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి: