Rahul Gandhi: లోక్‌సభపై గందరగోళం.. మహారాష్ట్ర ఎన్నికలపై రాహుల్ విమర్శలు

Rahul Gandhi demands discussion on voter list in Lok Sabha: ఓటర్ల జాబితాపై దేశవ్యాప్తంగా అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఈ సందర్భంగా లోక్‌సభలో కేంద్రంపై విమర్శలు చేశారు. పార్లమెంట్‌లో ఈ విషయంపై చర్చ జరగాలని కోరారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు.
కాగా, పార్లమెంట్ మలివిడత బడ్జెట్ సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. వక్ఫ్ బోర్డు, సవరణ చట్టం, కొత్త విద్యావిధానం, భారత్‌పై ట్రంప్ సుంకాలు వంటి తదితర అంశాలపై చర్చించేందుకు విపక్షాలు పట్టుబడడుతున్నాయి. ఓటర్ల జాబితాలో అవకతవకలపై చర్చలు జరపాలని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా, కేంద్రం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానంపై లోక్‌సభలో తమిళనాడు అధికార పార్టీ డీఎంకే ఎంపీలు లేవనెత్తారు. దీంతో లోక్‌సభలో గందరగోళం నెలకొంది. ఈ విషయంపై స్పందించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. లోక్‌సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ ఓం బిర్లా సభను వాయిదా వేశారు.
విద్యార్థుల జీవితాలతో డీఎంకే చెలగాటమాడుతోందని కేంద్ర మంత్రి అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుపై డీఎంకే పార్టీకి చిత్తశుద్ధి లేదని, ఆ పార్టీ నేతలకు నిజాయితీ లేదన్నారు. భాష విషయంలో ప్రతీసారి వివాదాలు నెలకొల్పడమే ఆ పార్టీ ముఖ్య ఉద్దేశమని చెప్పారు. కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తున్నారని, ఈ విషయంలో వారి చర్యలు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఉన్నాయని ఆరోపించారు.