బిగ్ బాష్ లీగ్: క్రికెట్ చరిత్రలో అతి చెత్త రికార్డు.. సిడ్నీ థండర్స్ జట్టు ఎంత స్కోర్ చేసిందంటే..?
భారత దేశంలో బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ టోర్నీ తర్వాత క్రికెట్ ప్రపంచంలో అంతటి ప్రజాదరణ ఉన్న టీ20 టోర్నీ ఏదైనా ఉందా అంటే అది బిగ్ బాష్ లీగ్ (BBL)అని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఈ టీ20 టోర్నీలో పెను సంచలనం నమోదైంది.
Big Bash League: భారత దేశంలో బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్ టోర్నీ తర్వాత క్రికెట్ ప్రపంచంలో అంతటి ప్రజాదరణ ఉన్న టీ20 టోర్నీ ఏదైనా ఉందా అంటే అది బిగ్ బాష్ లీగ్ (BBL)అని చెప్పవచ్చు. అయితే ప్రస్తుతం ఈ టీ20 టోర్నీలో పెను సంచలనం నమోదైంది. టి20 ఫార్మాట్లో విధ్వంసక ఆటగాళ్ల జాబితాలో నిలిచే అలెక్స్ హేల్స్, రిలీ రోసో వంటి అంతర్జాతీయ ఆటగాళ్లున్న సిడ్నీ థండర్ జట్టు క్రికెట్ చరిత్రలో అతి చెత్త స్కోరు నమోదు చేసి రికార్డుకెక్కింది. దానితో ఇప్పుడు నెట్టింట సిడ్నీ థండర్స్ ట్రెండ్ అవుతుంది.
35 బంతుల్లోనే జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. కేవలం 15 పరుగులు మాత్రమే చేసి ఆల్ అవుట్ అయ్యి సిడ్నీ జట్టు యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది. కాగా ఇప్పటి వరకు జరిగిన ప్రొఫెషనల్ టీ20ల్లో ఇదే అత్యల్ప స్కోరు కావడం గమనార్హం. 2019లో చెక్ రిపబ్లిక్‌పై టర్కీ 8.3 ఓవర్లలో 21 పరుగులకే ఆలౌటై నెలకొల్పిన ప్రపంచ రికార్డును ఇప్పుడు సిడ్నీ థండర్ బద్దలు కొట్టింది. శుక్రవారం నాడు అడిలైడ్ స్ట్రైకర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సిడ్నీ థండర్స్ జట్టు ఇన్నింగ్స్ కేవలం 5.5 ఓవర్లలోనే ముగిసిపోవడం విశేషం. టీ20ల్లో అతి తక్కువ ఓవర్లలో ఇన్నింగ్స్‌ను ముగించిన జట్టుగానూ థండర్ రికార్డులకెక్కింది.
మొదట బ్యాటింగ్ కు దిగిన స్ట్రైకర్స్ జట్టు 9 వికెట్లకు 139 పరుగులు చేయగా.. హెన్రీ థార్న్టన్, వెస్ అగార్ల ధాటికి థండర్ జట్టు చిత్తుచిత్తు అయ్యింది. క్రికెట్ ప్రపంచంలో అతి చెత్త రికార్డులను తమ ఖాతాలో వేసుకుంది. ఆ జట్టులో నలుగురు స్టార్ ఆటగాళ్లు డకౌట్ కాగా..
ముగ్గురు ఒక్క పరుగుకే ఔటయ్యారు. ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోగా 4 పరుగులు చేసిన డాగెట్ టాప్‌స్కోరర్ అవడం విశేషం. దీన్ని బట్టి చూస్తే వారు ఎంతదారుణంగా ఆడారో అర్ధం చేసుకోవచ్చు. వెస్ అగర్ 12 బంతుల్లో 6 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా.. 17 బంతుల్లో 3 పరుగులే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టిన అడిలైడ్ పేసర్ హెన్రీ థార్టన్ సిడ్నీ ఓటమిలో కీలక పాత్ర పోషించాడు.