Operation Sindoor : ముగిసిన అఖిలపక్ష భేటీ.. సందేశాన్ని వినిపించిన ప్రధాని మోదీ

All-party meeting chaired by Rajnath Singh : పహల్గాం ఉగ్రదాడికి ఆపరేషన్ సిందూర్ అనే పేరుతో ఇండియా పాక్‌కు గట్టిగా బదులిచ్చింది. దేశ భద్రతా బలగాలు మంగళవారం అర్ధరాత్రి ఉగ్రస్థావరాలపై దాడిచేయగా, దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతోంది. ఆపరేషన్ సిందూర్ గురించి వివరించడానికి కేంద్రప్రభుత్వం గురువారం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. దేశమంతా ఐక్యంగా నిలబడాలని ప్రధాని ఇచ్చిన సందేశాన్ని వినిపించింది. భేటీకి ముందు ప్రధాని నివాసానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్ వచ్చారు. ఈ నేపథ్యంలో భద్రతా పరిస్థితులను ప్రధాని మోదీకి వెల్లడించారు.
రెండోసారి భేటీ..
పహల్గాం ఉగ్రదాడి తర్వాత అఖిలపక్ష భేటీ కావడం ఇది రెండోసారి. పార్లమెంట్ ప్రాంగణంలో అఖిలపక్ష భేటీ జరిగింది. భేటీకి కేంద్రం మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, అమిత్ షా, ఎస్.జైశంకర్, జేపీ నడ్డా, నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. విపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సందీప్ బందోపాద్యాయ్, టీఆర్ బాలు తదితరులు పాల్గొన్నారు. భేటీకి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ప్రధాని సందేశాన్ని వినిపించారు. ఈ సమయంలో అన్ని పార్టీలు ఐక్యంగా నిలబడాలని ప్రధాని కోరినట్లు జాతీయ మీడియా పేర్కొంది. ఆపరేషన్ సిందూర్ గురించి ప్రతిపక్షాలకు వివరించిన నేపథ్యంలో ఈ మేరకు ప్రధాని మోదీ అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. బుధవారం పాక్ ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడంతో సాయుధ దళాలు కీలకంగా వ్యవహరించాయని ప్రతిపక్షాలు ప్రశంసించాయి.
100 మంది ఉగ్రవాదులు హతం..
ఆపరేషన్ సిందూర్‌లో 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. అఖిలపక్ష భేటీలో మాట్లాడారు. పహల్గాం దాడికి నిరసనగా ఇండియా మంగళవారం అర్ధరాత్రి ఆపరేషన్ సిందూర్ అనే పేరుతో పాక్, పీవోకేలోని తొమ్మిది ఉగ్ర శిబిరాలపై దాడులు చేశాయి.
ఉగ్రవాదానికి ప్రాధాన్యత..
మంగళవారం అర్ధరాత్రి క్షిపణులు, డ్రోన్లతో పాక్‌తోపాటు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌పై ఆపరేషన్ సిందూర్ అనే పేరుతో విరుచుకుపడింది. భారత్ సరిహద్దులకు అవతల 100 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లి 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. దీంతో 80 మంది ఉగ్రవాదులను హతమార్చి ప్రతీకారం తీర్చుకుంది. భారీ స్థాయిలో దాడులు చేసినా తన బాధ్యతను ఇండియా మరిచిపోలేదు. ఎక్కడా పాకిస్థాన్ సైనిక స్థావరాలు, పౌరుల నివాసాలపై దాడి చేయలేదు. ఉద్రిక్తతలను రెచ్చగొట్టే చర్యలకు పాల్పడలేదు. ప్రపంచానికి ముప్పుగా ఉన్న ఉగ్రవాద మూలాలను పెకిలించడానికే ప్రాధాన్యం ఇచ్చింది.