Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్
Road Accident In Karnataka five died:కర్ణాటక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో కొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల ప్రకారం.. ఏపీలోని కర్నూల్ జిల్లాకు చెందిన మంత్రాలయం వేద పాఠశాలకు చెందిన విద్యార్థులు కర్ణాటకలోని హంపీ ప్రాంతానికి విహారయాత్రకు బయలుదేరారు. అయితే మంగళవారం అర్ధరాత్రి సింధనూరు సమీపంలో విద్యార్థుల వాహనం ప్రమాదానికి గురైంది.
రాయిచూరు జిల్లా సింధనూరు వద్ద టైర్ పంక్చర్ కావడంతో ఒక్కసారిగా విద్యార్థులు ప్రయాణిస్తున్న తుఫాన్ వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ తో పాటు మొత్తం ఐదుగురు దుర్మరణం చెందారు. మృతుల్లో మంత్రాలయం వేద పాఠశాల విద్యార్థులు నలుగురు ఉన్నారు. డ్రైవర్ శివ, విద్యార్థులు అభిలాష, హైవదన, సుజేంద్రగా గుర్తించారు. ఈ వాహనంతో మొత్తం 14 మంది విద్యార్థులు ఉన్నారని సమాచారం. గాయపడిన విద్యార్థులను సింధనూరు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. వీరంతా రఘునందనతీర్థ ఆరాధనోత్సవాలకు వెళ్తున్నట్లు తెలుస్తోంది.