Last Updated:

Gidugu Ramamurthy Panthulu: తెలుగుకు గొడుగు.. మన గిడుగు..!

Gidugu Ramamurthy Panthulu: తెలుగుకు గొడుగు.. మన గిడుగు..!

Gidugu Ramamurthy Panthulu: తెలుగుజాతి వికాసానికి దోహదపడిన అనేక కీలక అంశాలలో భాష ఒకటి. అయితే, ఆ భాష, దాని తాలూకూ సాహిత్యం పండితులుగా చెలామణి అయ్యే గుప్పెడు మంది చేతిలో బందీ కావటాన్ని నిరసించిన వైతాళికుల్లో గిడుగు రామమూర్తి పంతులుగారు అగ్రగణ్యులు. తెలుగు భాష అందరిదీననీ, గ్రాంథికంలోని, అర్థం కాని తెలుగు కంటే.. జనం మాట్లాడే భాషలోనే జీవముందని నమ్మి, రాతలోనూ అదే వ్యావహారికాన్ని పరిచయం చేసిన అభ్యుదయ వాదిగా నిలిచారు. ఆయన చేసిన ఉద్యమం మూలంగా నాడు కొద్దిమందికే పరిమితమైన చదువు, వ్యావహారికభాషలో సాగి, అందరికీ అందుబాటులోకి వచ్చింది. అది పామర జనంలోని సృజనాత్మకతను సాహిత్యంగా మార్చగలిగింది. ఆంధ్రదేశంలో వ్యావహారిక భాషోద్యమానికి మూలపురుషుడిగా, బహుభాషా శాస్త్రవేత్తగా, చరిత్రకారుడిగా, సంఘసంస్కర్తగా, హేతువాదిగా గుర్తింపు పొందిన ఆ మహనీయుని వర్ధంతి నేడు.

గిడుగు వెంకట రామమూర్తి 1863 ఆగష్టు 29 వ తేదీ శ్రీకాకుళానికి ఉత్తరాన ఇరవైమైళ్ళ దూరంలో ముఖలింగ క్షేత్రం దగ్గర ఉన్న పర్వతాలపేట అనే గ్రామం లో జన్మించాడు. అతని తండ్రి వీర్రాజు, తల్లి వెంకమ్మ. వీర్రాజు పర్వతాలపేట ఠాణాలో సముద్దారు (రివెన్యూ అధికారి)గా పనిచేసేవాడు. ప్రాథమిక విద్య ఆ ఊళ్ళోనే సాగింది. తండ్రి ఉద్యోగం చోడవరానికి బదిలీ కావటం, అక్కడ ఆయన అనుకోకుండా విషజ్వరంతో చనిపోవటంతో విజయనగరం చేరి మేనమామగారి ఇంట్లో ఉంటూ మహారాజావారి ఇంగ్లీషు పాఠశాలలో చేరి 1879లో మెట్రిక్యులేషన్‌ పాసయ్యారు. చదువుకునే రోజుల్లో గురజాడ అప్పారావు గారు ఈయనకు సహాధ్యాయిగా ఉండేవారు. మెట్రిక్ పూర్తి కాగానే వివాహం, ఆ వెంటనే 1880లో రూ.30 వేతనంతో పర్లాకిమిడి రాజావారి స్కూల్లో ఫస్టుఫారం చరిత్ర టీచరుగా చేరారు. తల్లి, భార్య, ఇద్దరు చెల్లెళ్ళ బాధ్యతలను చూస్తూనే, ప్రైవేటుగా చదివి 1886లో ఎఫ్‌.ఏ, 1896లో బి.ఏ పట్టా పుచ్చుకున్నారు. బీఏలో ఇంగ్లీషు, సంస్కృతం, చరిత్రను ప్రధాన పాఠ్యాంశాలుగా ఎంచుకున్న గిడుగు ఆ పరీక్షల్లో రాష్ట్రస్థాయిలో రెండోర్యాంకరుగా నిలిచారు. దీంతో హైస్కూలు టీచరుగా, పిదప కాలేజీ లెక్చరర్‌గా పనిచేశారు. టీచరుగా పనిచేస్తూనే అప్పటి ప్రభుత్వ సూళ్లమీద పర్యవేక్షణాధికారిగా ఉన్న జే.ఏ.యేట్స్‌ అనే ఆంగ్లేయ అధికారి, ఏవీఎస్‌ కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస అయ్యంగార్‌, గురజాడ అప్పారావు వంటి వారి మద్దతుతో వాడుక భాషా ఉద్యమాన్ని చేపట్టారు. ఆయన కృషి కారణంగా 1912-13లో స్కూలు ఫైనల్ బోర్డు పరీక్షల్లో తెలుగు వ్యాస పరీక్షను గ్రాంథికంలో గాక.. గద్యంలో లేదా వ్యావహారిక భాషలో రాయవచ్చునని ఆదేశాలు వచ్చాయి. ఇది భాషావేత్తగా ఆయనకు దక్కిన తొలివిజయం.

శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలోని కొండ ప్రాంతాల్లోని వేలాది మంది ‘సవర’జాతి ఆదివాసులు నివసించేవారు. బయటి ప్రపంచం గురించి, చదువు సంధ్యల గురించి తెలియని వారి ‘సవర’భాషకు ఎలాంటి లిపి లేదు. అది కేవలం మాట్లాడే భాష మాత్రమే. దీంతో పంతులుగారు ఆ భాషను అర్థం చేసుకుని, దానికి ఒక లిపిని రూపొందించారు. దీంతో మైదాన ప్రాంతాలతో ఎంతో కొంత సంబంధాలున్న సవర పెద్దలను కలిసి, సవరభాషలో లిపిని తయారుచేసి, వారికి వారి భాషలోనే పుస్తకాలు తయారుచేసే పనికి పూనుకున్నారు. అడవి మీద బతికే సవరలు చదువు మీద ఆసక్తి చూపకపోవటంతో తొలినాళ్లతో కొందరు సవరపిల్లలకు తన ఇంట్లోనే భోజనం, వసతి కల్పించి మార్గదర్శకత్వం వహిస్తూ, సవరల్లో చదువు పట్ల ఆసక్తిని పెంచారు. ఆ తర్వాత సవరలు తమ పిల్లలను బడికి పంపటం మొదలైంది. అంతేగాక ఆ సవర పిల్లలు తమ భాషలోనే చదువుకునేలా నాటి మద్రాసు ప్రభుత్వాన్ని ఒప్పించారు. ఈయన కృషి ఫలితంగా 1911లో నాటి మద్రాసు ప్రభుత్వం ఈ సవర పుస్తకాలను, సిలబస్‌ను ఆమోదించటమే గాక సొంత నిధులతో ప్రింట్ చేయించి అందించింది. సవరల కోసం ఎంతో శ్రమించిన రామ్మూర్తి పంతులు గారి సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం కొంత పారితోషికాన్ని ఇచ్చినా, ఆయన దానిని తిరస్కరించి,‘ఆ డబ్బుతో ఆ అడవి బిడ్డల కోసం ఒక మంచి బడి పెట్టండి, పేదల కోసం నేను పెట్టే బడులకు నిబంధనల మేరకు ప్రభుత్వ నిధులు ఇవ్వండి!’అని కోరారు. ఆ తర్వాతే సవరలున్నంత మేర కొత్త పాఠశాలలు అందుబాటులోకి వచ్చాయి.

ఇదే ఊపులో సవరలు మాట్లాడే అన్ని పదాలకు అర్థాలను తెలిపే పుస్తకాలను, వారి సంస్కృతి, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు, పండుగలు, జీవనవిధానానికి సంబంధించి చిన్న చిన్న పుస్తకాలు రాస్తూ వచ్చారు. క్రమంగా అక్కడి పిల్లలు చదువుకునేందుకు పూర్తి స్థాయి సిలబస్‌నూ రూపొందించారు. 1930లో సవర భాషలో ‘ఎ మాన్యువల్ ఆఫ్ సవర లాంగ్వేజ్’అనే గ్రామర్ బుక్‌ను రూపొందించారు. 1938లో సవర -ఇంగ్లీషు డిక్షనరీని, తెలుగు – సవర, సవర – తెలుగు డిక్షనరీని రూపొందించారు. అలాగే.. పండితుల రచనలలోని వ్యాకరణ విరుద్ధ ప్రయోగాలను ఎత్తిచూపుతూ 1911-12 మధ్య ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజం అనే గ్రంథాన్ని రాశారు. ఆదివాసీల అక్షరశిల్పిగా, సవర లిపి నిర్మాతగా పంతులుగారి 30 ఏళ్ల భాషాసేవకు మెచ్చిన బ్రిటిష్ ప్రభుత్వం 1933లో కైజర్- ఇ- హింద్ బిరుదును, బంగారు పతకాన్ని బహూకరించగా, నాటి మద్రాసు ప్రభుత్వం ‘రావుబహుద్దూర్‌’బిరుదును, ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ బిరుదుతో ఆయనను గౌరవించింది. శాసనాల్లోని లిపిని నేర్చుకుని, పరిశోధనలు చేసి పలు శాసానాల మీద చారిత్రక వ్యాసాలు కూడా రాశారు. 1919 లో ‘తెలుగు’అనే మాస మాసపత్రికను స్థాపించి భాషా సాహిత్యాలను అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. తర్వాత 1935లో శ్రీకాకుళం- ఒరిస్సా బోర్డర్‌లోని తెలుగువారు మెజారిటీగా ఉన్న పర్లాకిమిడిని, మరో 200 గ్రామాలను నాటి మద్రాసు ప్రభుత్వం ఒడిసాలో కలపటాన్ని పంతులుగారు గట్టిగా నిరసించారు. ఈ తర్వాత కూడా 22 ఏళ్ల పాటు మూరుమూల పర్లాకిమిడిలోనే జీవించి, చివరి రోజులను రాజమండ్రిలోని కుమారుడి వద్ద గడిపారు. చివరి వరకు వాడుక భాషకు గౌరవాన్ని తెచ్చేందుకు శ్రమించిన పంతులుగారు 1940 జనవరి 22న కన్నుమూశారు. ఆయన జయంతిని (ఆగస్టు 29) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాతృభాషా దినోత్సవంగా జరుపుతోంది. నేటి ఆయన వర్థంతి సందర్భంగా ఆ మహనీయునికి అక్షర నివాళి.

ఇవి కూడా చదవండి: