Rajiv Gandhi assassination case: రాజీవ్ గాంధీ హత్య కేసు.. దోషుల విడుదలకు సుప్రీం ఆదేశాలు
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న దోషులను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దోషుల విడుదలకు తమిళనాడు ప్రభుత్వం, సోనియా కుటుంబం సానుకూలంగా ఉండడంతో సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది.
Supreme Court: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న దోషులను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దోషుల విడుదలకు తమిళనాడు ప్రభుత్వం, సోనియా కుటుంబం సానుకూలంగా ఉండడంతో సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఆరుగురు దోషులు తమిళనాడులోని వేలూరు జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. తమను విడుదల చేయాలంటూ వారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇందులో ప్రతివాదులుగా ఉన్న కేంద్ర ప్రభుత్వం సహా అందరి అభిప్రాయాల తర్వాత దోషులను విడుదల చేయాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.
రాజీవ్ గాంధీ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఎస్ నళిని, జయకుమార్, ఆర్పీ రవిచంద్రన్, రాబర్ట్ పయస్, సుధేంద్ర రాజా, శ్రీధరన్‌లకు జైలు జీవితం నుంచి విముక్తి లభించింది. వీరంతా జైలులో మంచి నడవడికతో ప్రవర్తించారని, అంతేకాకుండా వేర్వేరు డిగ్రీలు సాధించారని అత్యున్నత న్యాయస్థానం గుర్తించింది. దోషులను జైలు నుంచి విడుదల చేయాలని 2018 సెప్టెంబరు 9న తమిళనాడు రాష్ట్ర మంత్రివర్గం సిఫారసు చేసింది. శిక్ష తగ్గించాలని ఆ రాష్ట్ర గవర్నర్‌కు దోషులు విజ్ఞప్తి చేయడాన్ని కూడా సుప్రీంకోర్టు గుర్తించింది.
నళిని ప్రస్తుతం పెరోల్‌పై ఉన్నారు. ఆమె పిటిషన్‌ను మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చింది. అనంతరం ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 30 సంవత్సరాలకు పైగా జైలు శిక్ష అనుభవించిన ఏజీ పెరరివలన్‌ను విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో నళిని ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.
ఇది కూడా చదవండి: Vande Bharat Express : దక్షిణాదిన మొదటి వందేభారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ