Amit Shah: అంబేద్కర్ పేరుతో అమిత్‌షాపై గురి .. షా ప్రసంగంపై ఎంపీల ఫైర్
Opposition MPs Protest Over Amit Shah Comments On Ambedkar: బీఆర్ అంబేద్కర్‌పై బుధవారం హోమంత్రి అమిత్ షా రాజ్యసభలో చేసిన వ్యాఖ్యల రగడ.. గురువారం కూడా పార్లమెంటు ఉభయ సభలనూ కుదిపేసింది. షా వ్యాఖ్యలకు నిరసనగా ప్రతిపక్ష ఎంపీలు ఆందోళన చేపట్టగా, అంబేద్కర్‌ను కాంగ్రెస్ అవమానించిందని ఆరోపిస్తూ అధికార పక్షమూ నిరసనకు దిగింది. మొత్తంగా గురువారం కూడా ఈ అంశం కారణంగా సభా సమయం వృధా అయింది.
పోటాపోటీగా నిరసనలు
పార్లమెంట్‌లోని మకరద్వారం వద్ద ఉన్న గోడ ఎక్కి ఇండియా కూటమి ఎంపీలు ఫ్లకార్డులు చూపిస్తూ ఆందోళన చేపట్టారు. అదే సమయంలో అక్కడకు ఎన్డీయే కూటమి ఎంపీలు వచ్చారు. ఈ క్రమంలో పార్లమెంట్‌లోనికి వస్తున్న అధికార పక్ష ఎంపీలను విపక్ష నేతలు అడ్డుకోగా, ఈ క్రమంలో జరిగిన తోపులాటలో బీజేపీ ఎంపీలు ముకేశ్ రాజ్‌పుత్, ప్రతాప్ చంద్ర సారంగి గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. రాహుల్ గాంధీ తోయడం వల్లే ఎంపీ గాయపడ్డారని బీజేపీ ఆరోపించింది.
ఐసీయూలో ముకేశ్ రాజ్‌పుత్..
గాయపడ్డ ఎంపీలిద్దరికీ తలలకు దెబ్బలు తగిలాయని వైద్యులు తెలిపారు. వీరిలో ముకేశ్ రాజ్‌పుత్‌కు ఐసీయూలో చికిత్స అందించారు. మరో ఎంపీ ప్రతాప్ చంద్ర సారంగి తలకు లోతైన గాయమై తీవ్ర రక్తస్రావం జరిగిందని, దీంతో తలకు కుట్లు వేశామని తెలిపారు. ముకేశ్ రాజ్‌పుత్ వైద్యం అందించాక స్పృహ కోల్పోయిన స్థితిలో వచ్చినట్లు చెప్పారు. కాగా, వీరిని ప్రధాని మోదీ ఫోన్లో పరామర్శించారు. కాగా, తాను తాను మెట్ల వద్ద నిల్చొని ఉండగా, రాహుల్ గాంధీ ఓ ఎంపీని నెట్టేశారని, రాహుల్ వచ్చి తనపై పడటంతో తాను కిందపడ్డానని సారంగి తెలిపారు.
షాకు మోదీ అండ..
కాగా, అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను ప్రధాని మోదీ గట్టిగా సమర్థించారు. అంబేద్కర్ చరిత్రను తుడిచిపెట్టేందుకు ఆ పార్టీ పన్నని కుట్ర లేదని, ఆ కుట్రలను అమిత్ షా బయటపెట్టటంతోనే కాంగ్రెస్ నేతలు దాడులకు దిగారని ప్రధాని ఆరోపించారు. ప్రజలకు అన్ని వాస్తవాలు తెలుసునని ప్రధాని ‘ఎక్స్’లో వరుస ట్వీట్లు చేశారు. పార్లమెంటరీ చరిత్రలో ఇదో బ్లాక్ డే అని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మండిపడ్డారు.
నన్ను బెదిరించారు : రాహుల్
ఈ ఘటనపైవిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. జరిగిన ఘటన మీ కెమెరాల్లో కనబడి ఉండొచ్చని, తాను పార్లమెంట్ లోపలికి వెళ్తుండగా బీజేపీ ఎంపీలు అడ్డుకొనే ప్రయత్నం చేశారని ఆరోపించారు. మల్లికార్జున్ ఖర్గేను కూడా నెట్టేశారని తెలిపారు. తమకు లోపలికి వెళ్లే హక్కు లేదా అని నిలదీశారు. కాగా, ఉద్దేశపూర్వకంగానే తోపులాట సృష్టించారంటూ రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీలు అనురాగ్ ఠాకూర్, బన్సూరి స్వరాజ్ పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు రాహుల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.