Telangana: కాంగ్రెన్ నాయకుడి విగ్రహావిష్కరణ చేయనున్న అమిత్ షా.!

Telangana: తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వస్తున్నారు. నిజామాబాద్ లో పసుపుబోర్డును ప్రారంభించేందుకు గాను ఆయన హాజరవుతున్నారు. పర్యటనలో భాగంగా నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తండ్రి దివంగత డి.శ్రీనివాస్ విగ్రహావిష్కరణ చేయబోతున్నారు. డీఎస్ బతికున్నంత కాలమూ బీజేపీలో లేరు. అందునా కాంగ్రెస్, బీఆర్ఎస్ లలో కీలక పదవుల్లో ఉన్నవ్యక్తి. కుమారుడు బీజేపీలో ఎంపీగా ఉన్నా.. కాషాయ కండువా కప్పుకోలేదు డీఎస్. అటువంటి వ్యక్తి విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరించడం వెనుక గల కారణాలపై ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తన తండ్రి విగ్రహావిష్కరణకు అమిత్ షాను పిలవడం వెనుక ధర్మపురి అరవింద్ ప్లాన్స్ ఏమై ఉండవచ్చని తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో వర్గపోరు తీవ్రంగా ఉంది. తామంటే తామే అధిపతులమన్నట్లుగా కమలనాథులు పోటీ పడుతున్నారు. అధ్యక్ష పదవికి బండిసంజయ్, ఈటల, డీకే అరుణ, కిషన్ రెడ్డి, రఘునందన్ రావు వంటి ప్రముఖులు పోటీ పడుతున్న నేపథ్యంలో.. తానూ బలవంతుడినేనని నిరూపించుకునే పనిలో పడ్డారు ధర్మపురి అరవింద్. ఈ నాయకులకు ఇప్పటికే కేంద్రంలో మంచి పలుకుబడి ఉంది. బండి సంజయ్, కిషన్ రెడ్డిలు ఇప్పటికే కేంద్ర మంత్రులుగా ఉండగా.. డీకే అరుణ, రఘునందన్ రావు, ఈటల ఎంపీలుగా ఉండి కేంద్రంలో పలుకుబడిని పెంచుకుంటున్నారు. ధర్మపురి అరవింద్ కూడా ఎంపీగానే ఉన్నా… ఆయనకు కేంద్ర పెద్దల దగ్గర సాన్నిహిత్యం తక్కువగా ఉందన్న వాదన వినిపిస్తోంది. అందుకే తన పలుకుబడిని నిరూపించుకునేందుకే ధర్మపురి విగ్రహావిష్కరణతో అందరి నోళ్లూ మూయించేందుకు ప్లాన్ వేశారంటారు నిపుణులు.
మరోవైపు అమిత్ షా కూడా విగ్రహావిష్కరణకు ఒప్పుకోవడానికి ప్రత్యేక కారణం ఉండే ఉంటుంది. మోదీ, షా లు ఏ పని చేసినా.. అందులో ఆంతర్యం కచ్చితంగా దాగి ఉంటుంది. ప్రతి చిన్న అంశంలోనూ రాజకీయ లాభం చూసుకుంటారు. ఇందులో తప్పేమీ లేదు. డీఎస్ కు బీజేపీతో ప్రత్యక్ష సంబంధాలు ఎప్పుడూ లేవు. ఆయన కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేతగా ఉన్నారు. రెండు సార్లు పీసీసీ చీఫ్ గా చేశారు. మంత్రిగా చేశారు. కాంగ్రెస్ దగ్గర ఏమీ మిగల్లేదని తేలిన తర్వాతే ఆయన బీఆర్ఎస్ లో చేరారు. అక్కడ రాజ్యసభ సీటు కొట్టేశారు. అయితే ఆయన తర్వాత మళ్లీ కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. కానీ అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. తన కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ ఎంపీగా ఉన్నా కూడా.. కాషాయ కండువా కప్పుకోలేదు. అటువంటి వ్యక్తి విగ్రహావిష్కరణను అమిత్ షా చేతుల మీదుగా జరుగనుంది.
కాంగ్రెస్ పార్టీలోనే కాకుండా.. ఏ పార్టీల్లో ఉన్నా.. ఆరోగ్యకర రాజకీయాలను చేసిన నేతలను బీజేపీ నేతలు ఎప్పుడూ సత్కరిస్తూనే వచ్చారు. దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ను కాంగ్రెస్ పార్టీ పక్కనపెట్టినా.. మోదీ మాత్రం ఆయనకు 182 అడుగుల విగ్రహాన్ని కట్టించి సత్కరించారు. పీవీ నరసింహారావు విషయంలోనూ కాంగ్రెస్ ఆయనను పక్కనబెట్టినా.. ఆయన ఆశయాలను కమలం పార్టీ పుణికిపుచ్చుకుంది. కమ్యూనిస్టు నాయకులకూ పద్మశ్రీ అవార్డు ప్రకటించిన చరిత్ర కాషాయ పార్టీకి ఉంది. ఇలా అన్ని పార్టీల్లోనూ మంచి నాయకులను దగ్గర చేసుకునే క్రమంలోనే డీఎస్ విగ్రహావిష్కరణకు అమిత్ షా మొగ్గు చూపి ఉండొచ్చంటారు విశ్లేషకులు. డీఎస్ పై ఎటువంటి అవినీతి మరక లేకపోవడమే ఇందుకు కారణమై ఉండవచ్చు.
అన్ని పార్టీల్లోనూ పేరున్న నాయకులను సొంతం చేసుకోవడం వల్ల బీజేపీకి కొన్ని ప్రయోజనాలూ ఒనగూరుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆయా నాయకుల అభిమానులకు కమలం పార్టీ పట్ల సానుకూలత ఏర్పడుతుంది. దీనివల్ల ఆయా నాయకుల అభిమానులను ఓటర్లుగా మార్చుకోవచ్చు. ఇదిలా ఉండగా.. మరోవైపు కల్వకుంట్ల కవిత ఇంటికి కేంద్రమంత్రి రాందాస్ అథవాలే వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర పర్యటనకు వచ్చిన అథవాలే కవిత ఇంటికి వెళ్లడం వెనుక కూడా అమిత్ షా ఆదేశాలేమైనా ఉన్నాయా? అనే అనుమానమూ తలెత్తుతోంది. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కవిత కాస్తంత దూరమయ్యారు.
పార్టీలో జరుగుతున్న అవకతవకలపై, కొందరు నేతలపై కేసీఆర్ కు కవిత రాసిన లేఖ లీక్ అయినప్పటినుంచీ.. ఆమెను పార్టీ కార్యక్రమాలకు దూరంగా పెట్టారన్న వాదన ఉంది. అలాంటి సమయంలో రాందాస్ అథవాలే కవిత ఇంటికి వెళ్లడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కమలం పార్టీ తెరచాటున పావులేమైనా కదుపుతోందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏది ఏమైనా.. కాషాయపార్టీ అగ్రనాయకులు కదిపే పావుల వెనుక చాలా మతలబు ఉంటుంది. కొన్ని సార్లు అవి బయటకు వస్తే కానీ.. అర్థం కావు. మరి ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న పరిణామాల వెనుక ఏం మతలబుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.