Amit Shah on English: ఇంగ్లిష్‌లో మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు వస్తాయి: అమిత్ షా
Amit Shah Interesting Comments on English: విదేశీ భాషలకు సంబంధించి కేంద్ర మంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లిష్‌లో మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు వస్తాయని, అలాంటి సమాజం ఏర్పడే రోజులు ఎంతో దూరంలో లేవని చెప్పారు. మన దేశ భాషలే మన సంస్కృతికి రత్నాలని పేర్కొన్నారు. అవి మనుగడలో లేకుంటే నిజమైన భారతీయులుగా ఉండలేమన్నారు. మాజీ ఐఏఎస్ అశుతోష్ అగ్నిహోత్రి రాసిన ఓ పుస్తకాన్ని ఆవిష్కరించిన సందర్భంగా అమిత్ షా మాట్లాడారు.
మన దేశంలో ఇంగ్లిష్‌లో మాట్లాడేవారు సిగ్గుపడే రోజులు వస్తాయన్నారు. అటువంటి సమాజం ఏర్పడే రోజులు ఎంతో దూరంలో లేవని తేల్చిచెప్పారు. మన దేశ భాషలే మన సంస్కృతికి రత్నాలు అన్నారు. మన భాషలే లేకుంటే మనం నిజమైన భారతీయులుగా ఉండలేమన్నారు. దేశ భాషా వారసత్వాన్ని పునరుద్ధరించే సమయం ఆసన్నమైందని వ్యాఖ్యానించారు. ఇందుకోసం ప్రయత్నం చేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు.
మన దేశం, మన సంస్కృతి, మన మతాన్ని అర్థం చేసుకునేందుకు ఏ పరాయి భాష సరిపోదని వ్యాఖ్యానించారు. విదేశీ భాషలతో సంపూర్ణ భారతీయ భావనను ఊహించుకోలేమన్నారు. ఇది ఎంత కష్టమో తనకు తెలుసని, అయినప్పటికీ ఇందులో భారత సమాజం విజయం సాధిస్తుందన్న విశ్వాసం ఉందన్నారు. మన దేశంతోపాటు ప్రపంచాన్ని మన సొంత భాషలతోనే నడిపిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఐఏఎస్ అగ్నిహోత్రి మాట్లాడారు. కేంద్ర సర్వీసు ఉద్యోగులకు ఇచ్చే శిక్షణలో మార్పు ఎంతో అవసరమని పేర్కొన్నారు.