Published On:

Amit Shah: నక్సలైట్లు త్వరగా జనజీవన స్రవంతిలో కలవాలి: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

Amit Shah: నక్సలైట్లు త్వరగా జనజీవన స్రవంతిలో కలవాలి: కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

Amit Shah visit to Nizamabad: నక్సలైట్లు వెంటనే హత్యాకాండ ఆపేసి లొంగిపోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా హెచ్చరించారు. ఆదివారం నిజామబాద్‌లో పసుపుబోర్డు జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం స్థానిక పాలిటెక్నిక్‌ మైదానంలో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళన సభలో పాల్గొని మాట్లాడారు.

 

పహల్గామ్‌లో ఉగ్రదాడితో పాక్ మనల్ని భయపెట్టాలని చూసిందని, తర్వాత భారత్‌ శక్తి ఏమిటో పాక్‌కు, ప్రపంచానికి తెలిసిందన్నారు. ఉగ్రవాదాన్ని మాత్రమే కాదు.. దేశంలోని నక్సలిజం లేకుండా చేయాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమన్నారు. నక్సలిజాన్ని తుదముట్టించాలా లేదా? మీరే చెప్పాలని కోరారు. 2026 మార్చి 30లోగా దేశంలో నక్సలిజం లేకుండా చేస్తామని స్పష్టం చేశారు. నక్సలైట్లు వెంటనే హత్యాకాండ ఆపేసి లొంగిపోవాలని సూచించారు. నక్సలైట్లు త్వరగా జనజీవన స్రవంతిలోకి రావాలని కోరారు. ఇప్పటికే 10వేల మంది నక్సలైట్లు లొంగిపోయారని, జన జీవన స్రవంతిలోకి వచ్చేశారని తెలిపారు.

 

తెలంగాణలో అధికారంలోకి వస్తాం..
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే బీజేపీ విజయం ఖాయమైందని తెలుస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీ ప్రకారం ఎంపీ అర్వింద్‌ నిజామాబాద్‌కు పసుపుబోర్డు సాధించారని తెలిపారు. పసుపుబోర్డు ప్రధాన కార్యాలయాన్ని నిజామాబాద్‌లోనే ఏర్పాటు చేస్తున్నామన్నారు. మోదీ ఏదైనా చెప్పారంటే అది చేసి చూపిస్తారన్నారు. నిజామాబాద్‌ రైతులు పసుపుబోర్డు కోసం 40 ఏళ్ల పాటు పోరాటం చేశారని తెలిపారు. నిజామాబాద్‌ రైతులు పండించిన పసుపు భవిష్యత్‌లో ప్రపంచమంతా ఎగుమతి అవుతుందన్నారు. పసుపుబోర్డు కార్యాలయం ఏర్పాటుతో స్థానిక రైతులకు ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయని చెప్పారు.

 

భారత్‌ ఆర్గానిక్‌ లిమిటెడ్‌, భారత్‌ ఎక్స్‌పోర్టు లిమిటెడ్‌ నిజామాబాద్‌లో ఏర్పాటు అవుతుందన్నారు. భారత్‌ ఎక్స్‌పోర్టు లిమిటెడ్‌తో నిజామాబాద్‌ పసుపు అమెరికా, యూరప్‌కు ఎగుమతి అవుతుందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందా? లేదా? ధరణి పోర్టల్‌, కాళేశ్వరం.. ఇలా అనేక అంశాల్లో అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. కాంగ్రెస్‌ తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంగా మార్చేసిందన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పోయిందని, కానీ, అవినీతి పోలేదన్నారు.

ఇవి కూడా చదవండి: