Amit Shah: పసుపు రైతులకు గుడ్ న్యూస్.. నిజామాబాద్ పసుపు గుబాళిస్తుంది.. అమిత్ షా

Union Home Minister Amit Shah to Launched National Turmeric Board: నిజామాబాద్ జిల్లాలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పర్యటిస్తున్నారు. ఈ మేరకు వినాయక్ నగర్‌లో ఏర్పాటు చేసిన పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించారు. అనంతరం పసుపు ఉత్పత్తులను ఆయన పరిశీలించారు. అంతకుముందు కార్యాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అమిత్ షా వెంట కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, అరవింద్, కె.లక్ష్మణ్ తో పాటు తెలంగాణ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క పాల్గొన్నారు. అనంతరం బస్వా గార్డెన్‌లో పసుపు రైతులతో అమిత్ షా సమావేశమయ్యారు.
తెలంగాణ పసుపు రైతుల సంక్షేమానికి కేంద్రం ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్ షా అన్నారు. తెలంగాణకు పసుపు బోర్డు ఇవ్వడమే కాదు.. బోర్డు చైర్మన్‌గా కూడా తెలంగాణ వ్యక్తినే నియమించామన్నారు. 40 ఏళ్ల పసుపుబోర్డు కలను మోదీ ప్రభుత్వం నెరవేర్చిందన్నారు. పసుపు పంటకు నిజామాబాద్ రాజధానిలాంటిదని చెప్పారు. తెలంగాణలో పసుపుబోర్డు కోసం బీజేపీ ఎంపీలు ఎంతో పోరాడినట్లు గుర్తుచేశారు.కొనుగోలు, రవాణా అంతా బోర్డు చూసుకుంటుందన్నారు.
ప్రపంచం అంతా నిజామాబాద్ పసుపు గుబాళిస్తుందని అమిత్ షా అన్నారు. పసుపు రైతులకు ప్రధాని మోదీ ఇచ్చిన హామీ నెరవేరిందన్నారు. బిలియన్ డాలర్ల విలువచేసే పసుపు ఉత్పత్తే లక్ష్యమన్నారు. రైతులకు బోర్డు ద్వారా నూతన సాగు విధానంపై శిక్షణ కల్పిస్తామన్నారు. నిజామాబాద్ పసుపుకి దేశవ్యాప్తంగా డిమాండ్ ఉందని, రైతులకు మంచి ధర రావాలన్నదే మా లక్ష్యమని అమిత్ షా చెప్పుకొచ్చారు.