Bihar: కాశ్మీర్ దేశం.. పరీక్షలో వచ్చిన ఓ ప్రశ్నపై రాజకీయ దుమారం
ఒక పాఠశాలలో 7వ తరగతి ప్రశ్నాపత్రంలో అడిగి ఓ ప్రశ్న ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. కాశ్మీర్‌ను వేరే దేశం చేశారని, భారతదేశం నుంచి కాశ్మీరును వేరుచేసే ప్రశ్న ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన బిహార్‌లోని కిషన్‌గంజ్‌లో గల పాఠశాలలో జరిగింది.
Bihar: ఒక పాఠశాలలో 7వ తరగతి ప్రశ్నాపత్రంలో అడిగి ఓ ప్రశ్న ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. కాశ్మీర్‌ను వేరే దేశం చేశారని, భారతదేశం నుంచి కాశ్మీరును వేరుచేసే ప్రశ్న ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన బిహార్‌లోని కిషన్‌గంజ్‌లో గల పాఠశాలలో జరిగింది.
బిహార్ ప్రభుత్వ విద్యాశాఖ 1-8 తరగతుల విద్యార్థులకు అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 18 వరకు మధ్యంతర పరీక్షలను నిర్వహించింది. కాగా ఆంగ్ల పరీక్షలో ఓ ప్రశ్న అడిగారు. ఇంతకీ ఆ ప్రశ్న ఏమిటంటే.. క్రింది దేశాల ప్రజలను ఏమని పిలుస్తారు? అని పరీక్షలో ప్రశ్న అడిగారు. దాని కింద ఆప్షన్స్ ఇచ్చారు. ఉదాహరణకు చైనా వారిని చైనీస్ అని పిలుస్తారని.. నేపాల్, ఇంగ్లాండ్, కాశ్మీర్, భారతదేశ ప్రజలను మరి ఏమని పిలుస్తారు? అంటూ అడిగారు. ఇంకేముంది ఇందులో కశ్మీర్ వేరే దేశంగా పొరపాటున రావడంతో వివాదం నెలకొనింది. అంతేకాదు ఈ వివాదం కాస్త రాజకీయ దుమారంగా మారింది. ఇది పొరపాటు కాదని కావాలనే ఇలా చేశారని కిషన్‌గంజ్ జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ సుశాంత్ గోపీ విమర్శలు ఎక్కుపెట్టారు. నితీష్ సర్కారు పిల్లల మనసుల్లో కశ్మీర్‌ను భారత్ నుంచి వేరుచేసి చూపే ప్రయత్నం చేస్తోందంటూ ఆరోపించారు.
దీనిపై స్పందించి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్కే దాస్ ఇది పొరపాటు వల్లే జరిగిందని.. అంతకు మించి ఇంకేం లేదన్నారు. ఈ ప్రశ్నాపత్రంలో కశ్మీర్ ప్రజలను ఏమని పిలుస్తారు అని ఉండటానికి బదులు కశ్మీర్ దేశ ప్రజలను ఏమని పిలుస్తారు అని అచ్చయ్యిందని అన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి సుభాష్ కుమార్ గుప్తా ఈ విషయంపై మాట్లాడేందుకు నిరాకరించారు. ఈ విషయాన్ని కావాలనే పెద్దది చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
మరోవైపు విద్యావేత్తలు, బీజేపీ నేతలు ఈ వ్యవహారం కుట్ర అని ఆరోపిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రితో విచారణ జరిపించాలని కోరారు. బీహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ తన సోషల్ మీడియాలో ప్రశ్నపత్రం ఫొటోను షేర్ చేశారు. ఇదిలా ఉండగా ఈ విషయంపై బిహార్ ప్రభుత్వం ఇప్పటికీ మౌనంగా ఉందని ఆయన మండిపడ్డారు.
అచ్చం ఇలానే ఐదేళ్ల క్రితం 2017లో బిహార్ ఎడ్యుకేషన్ బోర్డ్ ఏడో తరగతి ప్రశ్నా పత్రంలో ఇదే ప్రశ్న ఇచ్చింది. అయినా ఇప్పటి వరకు బీహార్ విద్యాశాఖ తన తప్పుని సరిచేసుకోలేకపోవడం బాధాకరమని నెట్టింట ప్రజలు కామెంట్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: దేశంలోనే అతిపెద్ద కోడిగుడ్డు.. బరువు 210 గ్రాములు