ED: ముంబై అధికారి ఇంట్లో ఈడీ రైడ్స్.. భారీగా డబ్బు, బంగారం సీజ్

Raids: ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు అవినీతి అధికారి చిక్కాడు. ఓ ప్రభుత్వ అధికారి ఇంట్లో సోదాలు చేసిన ఈడీ అధికారులు అక్కడ బయటపడిన బంగారం, డబ్బు చూసి నోరెళ్ల బెట్టారు. అసలు ఆ అధికారికి ఇంత నగదు, బంగారం ఎలా వచ్చాయనేది తెలియాల్సి ఉంది. ఈ మేరకు ఈడీ విచారణ చేసతోంది.
హైదరాబాద్ కు చెందిన వైఎస్ రెడ్డి ముంబైలో టౌన్ ప్లానింగ్ డిప్యూటీ డైరెక్టర్ గా పని చేస్తున్నాడు. బిల్డర్స్ తో కుమ్మక్కై 41 భవనాలకు అనధికారికంగా అనుమతులు ఇచ్చినట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు వైఎస్ రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. అందులో భాగంగానే హైదరాబాద్, ముంబైలోని ఆయన నివాసాల్లో, 12 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు జరిపింది.
సోదాల్లో 9 కోట్ల రూపాయలకు పైగా నగదు, 23 కోట్ల రూపాయలు విలువచేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. నోట్ల కట్టలు, నగలు చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. కోట్ల విలువైన డాక్యుమెంట్లను కూడా అధికారులు గుర్తించినట్టు తెలిసింది.