Covid-19 Cases in India: దేశంలో కరోనా పంజా.. ఢిల్లీలో సెంచరీ దాటిన కేసులు
Covid- 19 Cases in India: దేశంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కరోనా వైరస్ చాటుగా తన పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా కరోనా యాక్టీవ్ కేసుల సంఖ్య 1000 దాటి పోయింది. దీంతో కరోనాపై అన్ని రాష్ట్రాల్లో ఆందోళన నెలకొంది. ఇప్పటికే కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం అప్రమత్తం చేసింది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలోనూ కరోనా పాజిటీవ్ కేసుల సంఖ్య వంద దాటింది. కరోనా పాజిటీవ్ వచ్చిన వారిని హోం క్వారంటైన్ చేసినట్లు అధికారులు తెలిపారు.
మరోవైపు కేరళ, మహారాష్ట్రలోనూ కరోనా వైరస్ విజృంభిస్తోంది. కేరళలో 430 కేసులు బయటపడ్డాయి. దేశంలో అత్యధిక యాక్టివ్ కేసులు కేరళలో నమోదవుతున్నాయి. కేరళ తర్వాత మహారాష్ట్రలో పెద్ద సంఖ్యలో కరోనా యాక్టిస్ కేసులు రిజిస్టర్ అవుతున్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో 209 యాక్టీవ్ కేసులు నమోదయ్యాయి. ఇక గుజరాత్ లో 83, కర్నాటకలో 47, యూపీలో 15, పశ్చిమ బెంగాల్ లో 12 కేసులు బయటపడ్డాయి. మరోవైపు దేశంలో కరోనా పాజిటీవ్ కేసులు బయటపడుతున్నా.. ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కరోనా జాగ్రత్తలు పాటించాలని సూచించింది. వ్యక్తిగత శుభ్రత, సామాజిక దూరం పాటించాలని తెలిపింది. మాస్కులు ధరించాలని, జలుబు, దగ్గు, జ్వరం ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని తెలిపింది.