Shamar Joseph: వెస్టిండీస్ క్రికెటర్‌పై లైంగికదాడి ఆరోపణలు.. 11 మంది మహిళలతో..!

West Indies cricketer: వెస్టిండీస్ స్టార్ పేసర్ షమర్ జోసెఫ్‌పై లైంగిక ఆరోపణలు విండీస్ క్రికెట్ బోర్డులో సంచలనం రేపుతున్నాయి. జోసెఫ్ తనను లైంగికదాడి చేశాడంటూ డర్బైస్‌కు చెందిన ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. షమర్ తమను లైంగికంగా వేధించాడంటూ మరో 11మంది మహిళలు పోలీసులను ఆశ్రయించారు. షమర్ జోసెఫ్ 2023, మార్చి 3న ఓ యాడ్ కోసమని తీసుకెళ్లి తన కూతురిని లైంగికదాడి చేశాడని బాధితురాలి తల్లి పోలీసులకు తెలిపింది. అప్పట్లో తన కూతురుకు 18 ఏళ్లు అని. తర్వాత నుంచి తన ఆరోగ్యం ఆందోళనకరంగా మారిందని పేర్కొంది.
పోలీసుల తీరుతో తన కూతురు ఆసుపత్రి పాలైందని బాధితురాలి తల్లి వాపోయింది. లైంగికదాడి ఘటనకు సంబంధించిన సమాచారం బయటకు రాకుండా పోలీసులపై ఉన్నతాధికారులు ఒత్తిడి పెడుతున్నారని బాధితురాలి కుటుంబం ఆరోపిస్తోంది. ఘటనపై వెస్టిండీస్ క్రికెట్ బోర్డు స్పందించింది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు రావాల్సి ఉందని, తర్వాత నిర్ణయం తీసుకుంటామని విండీస్ బోర్డు వివరణ ఇచ్చింది.
ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌తో షమర్ జోసెఫ్ బిజీగా ఉన్నాడు. సిరీస్‌లోని తొలి టెస్ట్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లు తీశాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ పడగొట్టాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టు నుంచి ఆడాడు. 2024లో లక్నో టీమ్‌లోకి వచ్చిన పేసర్‌ను మెగా ఆక్షన్‌లో రైట్ టు మ్యాచ్ (ఆర్టీఎం) కింద రూ.75 లక్షల ధరకు తిరిగి జట్టులోకి తెచ్చుకుంది ఎల్‌ఎస్‌జీ.