Rahul Gandhi: లోక్‌సభలో నన్ను మాట్లాడనివ్వడం లేదు.. స్పీకర్‌పై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

Rahul Gandhi Says Speaker Not Letting Him Speak in Lok Sabha: లోక్‌సభలో తనను మాట్లాడేందుకు అనుమతించడం లేదని కాంగ్రెస్ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. లోక్‌సభలో గత 7 నుంచి 8 రోజులుగా తనను స్పీకర్ మాట్లాడేందుకు అనుమతి ఇవ్వడం లేదన్నారు. ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, ఏం జరుగుతుందో తెలియడం లేదన్నారు. కనీసం ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకుడికి సభలో ప్రసంగించే అవకాశం కల్పించడం సంప్రదాయమన్నారు.
లోక్‌సభ వాయిదా పడిన తర్వాత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగ అంశాన్ని లేవనెత్తేందుకు ప్రయత్నం చేస్తుంటే స్పీకర్ ఓం బిర్లా పారిపోతున్నారని ఎద్దేవా చేశారు. సభలో ప్రతిపక్ష నేత మాట్లాడేందుకు అనుమతి ఇచ్చే సంప్రదాయం ఉంటుందన్నారు. కానీ సభ్యులు నన్ను మాట్లాడనివ్వాలని కోరగా.. స్పీకర్ పారిపోతున్నారన్నారు. సభను నిర్వహించే విధానం ఇలా కాదని, ఆయనే నాపై వ్యాఖ్యలు చేసి సభను వాయిదా వేశారని ఆరోపించారు.
గత కొంతకాలంగా ప్రతిపక్షానికి మాట్లాడేందుకు అనుమతి ఇవ్వడం లేదని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ కుంభమేళా విషయంపై మాట్లాడిన సందర్భంలో నేను నిరుద్యోగంపై మాట్లాడాలని నిర్ణయించుకున్నానని, అయితే మాట్లాడేందుకు అనుమతి నిరాకరించారన్నారు. ఇలా ప్రతిపక్షానికి మాట్లాడే అర్హత ఇవ్వకుండా చేయడం అప్రజాస్వామికమని అన్నారు.
ఇదిలా ఉండగా, స్పీకర్ ఓం బిర్లా సభను ఉద్దేశించి మాట్లాడారు. సభ గౌరవాన్ని కాపాడాలని సూచించారు. సభ జరుగుతున్న సమయంలో అందరూ హుందాగా ప్రవర్తించాలన్నారు. అయితే కొంతమంది సభ్యుల ప్రవర్తన సరిగ్గా లేదని నా దృష్టికి వచ్చిందని తెలియజేశారు. ప్రస్తుతం ఈ సభలో తండ్రీకూతురు, తల్లీ కూతురు, భార్యాభర్తలు సభ్యులుగా ఉన్నారని, ఈ తరుణంలో ప్రతిపక్ష నేత 349 రూల్ పాటిస్తారని అనుకుంటున్నట్లు తెలిపారు.