Encounter in Chhattisgarh: 1000మంది మావోయిస్టులను చుట్టుముట్టిన 20వేల బలగాలు..

1,000 naxals surround by 20,000 troops in Chhattisgarh : వెయ్యిమంది మావోయిస్టులను 20వేల భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. మోస్ట్ వాంటెడ్ హిడ్మా టార్గెట్ గా కదులుతున్నాయి. ఈ ఆపరేషన్ ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో జరుగుతోంది. ఇందులో చత్తీస్ గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర కు చెందిన బలగాలు పాలుపంచుకుంటున్నాయి. మావోయిస్టులను నిర్మూలించడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్చి31, 2026ను గడువు విధించిన నేపథ్యంలో బలగాలు కదులుతున్నాయి. అగ్రనాయకులు ఉన్నారన్న పక్కా సమాచారంతో ఉచ్చుబిగించాయి. ఇందులో మోస్ట్ వాంటెండ్ హిడ్మా, బెటాలియన్ చీఫ్ దేవా ఉన్నట్లు తెలుస్తోంది. నిఘా వర్గాల సమాచారంతో సెర్చింగ్ మెదలైంది. మావోలు తప్పించుకోకుండా భద్రతా బలగాలు అన్ని వైపుల నుంచి దారులు మూసివేశాయి.
దేశంలో ఇప్పటివరకు చేసిన ఆపరేషన్లలలో ఈ ఆపరేషన్ అతిపెద్దదిగా పిలవబడుతోంది. ఇప్పటికే ఐదుగురు మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. 48గంటలకు పైగా ఈ ఆపరేషన్ కొనసాగుతుంది. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ దండకారణ్యంలో మావోయిస్టులను బలగాలు చుట్టుముట్టాయి. బస్టర్ ఫైటర్స్, జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF), రాష్ట్ర స్థాయి పోలీసులలోని అన్ని విభాగాలతో పాటు సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (CRPF) దాని ఎలైట్ కమాండో బెటాలియన్స్ ఫర్ రిసొల్యూట్ యాక్షన్ ( CoBRA) వంటి వివిధ భాగాలకు చెందిన భద్రతా సిబ్బంది ఈ ఆపరేషన్ లో పాల్గొన్నాయి.
నక్సల్స్ తప్పించుకునే అన్ని మార్గాలను మూసివేశాయి భద్రతా బలగాలు. అందులో భాగంగా ఛత్తీస్‌గఢ్-తెలంగాణ సరిహద్దులో ఉన్న కర్రెగుట్ట కొండలను బలగాలు చుట్టుముట్టాయి. దట్టమైన అడవులు, వరుస కొండలతో ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ ప్రాంతం, మావోయిస్టుల బెటాలియన్ నంబర్ 1 స్థావరంగా పరిగణించబడుతుంది.
కొన్ని రోజుల క్రితం మావోయిస్టులు ఒక ప్రెస్ నోట్ జారీ చేశారు. గ్రామస్తులెవరూ కొండపైకి ప్రవేశించవద్దని హెచ్చరించారు. ఈ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో పేలుడు సామాగ్రి అమర్చినట్లుగా తెలిపారు. దీంతో పాటే భారత ప్రభుత్వంతో చర్చలకు సిద్దమని కోరారు. అయితే భారత ప్రభుత్వ నుంచి ఎటువంటి నిర్ణయం వెలువడకపోగా బలగాలు మావోయిస్టులను ఏరివేసే కార్యక్రమంలో ఉన్నాయి.
భారత ప్రభుత్వం దేశాన్ని మావోయిస్టు రహితంగా చేయడమే లక్ష్యంగా కార్యచరణ రూపొందించింది. ఈ ఏడాది చత్తీస్ గఢ్ లో దాదాపు 150మంది మావోయిస్టులు చంపబడ్డారు. చత్తీస్ గఢ్, జార్కండ్ లో CRPF కమాండోలు జరిపిన దాడిలో కోటి బహుమతి కలిగిన అగ్రనాయకుడు సహా ఎనిమిది మంది మావోయిస్టులు మరణించారు.