Heavy Rains : రేపు, ఎల్లుండి ఏపీలో భారీ వర్షాలు
భారతవాతావరణ శాఖ (ఐఎండీ) సూచనల ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
Heavy Rains: భారతవాతావరణ శాఖ (ఐఎండీ) సూచనల ప్రకారం ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ప్రస్తుతానికి శ్రీలంకకు తూర్పున 600 కి.మీ. దూరంలో, తమిళనాడులోకి కారైకల్‌కు 630 కి.మీ. దూరంలో, చెన్నై తీరానికి 670 కి.మీ. దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది.
నెమ్మదిగా వాయుగుండం కొనసాగుతూ రాగల 48 గంటల్లో తమిళనాడు – దక్షిణ కోస్తాంధ్ర తీరాల వైపు కదిలే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు.వాయుగుండం ప్రభావంతో రేపు, ఎల్లుండి ఏపీలోని పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులను అప్రమత్తం చేసింది. దక్షిణ కోస్తాలోని ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని.. రాయలసీమలోని చిత్తూరు, వైఎస్ఆర్ జిల్లా, అన్నమయ్య జిల్లాలలోనూ భారీవర్షాలు కురుస్తాయని చెప్పింది.
దక్షిణ కోస్తా, రాయలసీమలో చాలాచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముందస్తు చర్యల కోసం సంబంధిత జిల్లాల యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. మత్స్యకారులు మంగళవారం వరకు దక్షిణకోస్తా-తమిళనాడు తీరం వెంబడి వేటకు వెళ్లరాదని ఆదేశాలు జారీ చేసింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.