CM Revanth Reddy Speech: ఆడబిడ్డలకే ఇందిరమ్మ ఇళ్లు.. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే మా అజెండా..!
CM Revanth Reddy Speech at Telangana Formation Day Celebrations: ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే మా అజెండా అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా పరేడ్ గ్రౌండ్స్‌లో పోలీసు కవాతు తర్వాత సీఎం ప్రసంగించారు. తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభాలు మహిళలు అన్నారు.
రాష్ట్రం వచ్చి పదేళ్లు గడిచినా ఆకాంక్షలు నెరవేరలేదని రేవంత్ రెడ్డి అన్నారు. పదేళ్లు ఆధిపత్యాన్ని తిరస్కరించి ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకున్నారన్నారు. దశాబ్ధాలుగా పోరాడి రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. మేము అధికారం చేపట్టే నాటికి వ్యవస్థలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, రాష్ట్రాన్ని పునర్నిర్మించే దిశగా అడుగులు వేస్తున్నామన్నారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేదే లక్ష్యమని సీఎం అన్నారు. ఆడబిడ్డలకే ఇందిరమ్మ ఇళ్లు కేటాయిస్తున్నామని చెప్పారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించినట్లు గుర్తు చేశారు.
రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని వివరించారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ కోసం ఏటా రూ.13వేల కోట్లు ఖర్చుచేస్తున్నామని తెలిపారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా రూ.12వేల సాయం అందిస్తున్నామన్నారు. సన్న వడ్లకు రూ.500 బోనస్ ఇస్తున్నామని చెప్పారు.
ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను నంబర్ వన్‌గా మార్చామన్నారు. భూ సమస్యలు పరిష్కరించేందుకు భూ భారతి చట్టాన్ని తీసుకొచ్చినట్లు చెప్పారు. ధరణి కొందరికి చుట్టమైతే.. భూభారతి ప్రజలకు రక్షణ చట్టమన్నారు.
ఏడాదిలోనే 60వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామని రేవంత్ వివరించారు. పెట్టుబడుల ద్వారా లక్ష మందికి ఉపాధి కల్పించామన్నారు. ఉద్యోగ భర్తీతో నిరుద్యోగుల విశ్వాసాన్ని చూరగొన్నామని చెప్పారు. యంగ్ ఇండియా స్కూల్స్ ద్వారా విద్యార్థులకు నైపుణ్యాలు నేర్పిస్తున్నామన్నారు.
ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ లేకపోవడం బాధాకరమన్నారు. క్రీడాకారులకు ప్రోత్సహించడానికే యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి నియోజకవర్గానికి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నామన్నారు. విద్య మీద పెట్టే డబ్బు ఖర్చు కాదు.. భవిష్యత్‌కు పెట్టుబడి అని పేర్కొన్నారు.
పేదల ఆరోగ్యమే మా ప్రభుత్వ బాధ్యత అని రేవంత్ అన్నారు. ఆస్పత్రుల్లో మౌళిక వసతుల కల్పనకు చర్యలు తీసుకున్నట్లు వివరించారు. రూ. 2వేల 700 కోట్లతో నూతన ఉస్మానియా ఆస్పత్రి నిర్మిస్తున్నామన్నారు. వందేళ్ల క్రితం దేశంలో కులగణన జరిగిందన్నారు. మళ్లీ వందేళ్ల తర్వాత దేశంలోనే తొలిసారిగా తెలంగాణలో కులగణన జరిగిందన్నారు.
56 శాతం ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని వెల్లడించారు. దేశ వ్యాప్తంగా కులగణన చేయాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. కులగణన విషయంలో దేశానికే తెలంగాణ ఆదర్శమని చెప్పారు.
ప్రపంచంలో తెలంగాణ పోటీ పడేలా పాలసీ డాక్యుమెంట్ తీసుకొస్తున్నామన్నారు. మూసీ నదికి పూర్వ వైభవం తెచ్చేందుకే మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు చేపట్టినట్లు తెలిపారు. న్యూయార్క్,టోక్యోతో పోటీ పడేలా ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామన్నారు. ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఫోర్త్ సిటీ నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రపంచ స్థాయి పెట్టుబడులకు ఫ్యూచర్ సిటీ కేంద్ర బిందువు అన్నారు. దేశ విదేశాలు తిరిగి రాష్ట్రానికి పెట్టుబడులు సాధించామని చెప్పారు.
హైదరాబాద్‌ను మరింత తీర్చిదద్దేందుకు జపాన్ సహకరిస్తోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఔటర్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందిందో అందరికీ తెలుసన్నారు. రీజినల్ రింగ్ రోడ్డుతో రాష్ట్ర రూపురేఖలే మారిపోతాయన్నారు. మెట్రో విస్తరించకపోవడంతో హైదరాబాద్ 9వ స్థానానికి పడిపోయిందన్నారు. త్వరలోనే మెట్రోను విస్తరించి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు.
రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే శాంతిభద్రతలే ముఖ్యమని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. దేశంలోనే నంబర్ వన్ పోలీసింగ్ వ్యవస్థ తెలంగాణలో ఉందన్నారు. శాంతిభద్రతలను కాపాడటంలో తెలంగాన పోలీసులే నంబర్ వన్ అన్నారు. డ్రగ్స్‌ను నియంత్రించడంలో తెలంగాణ పోలీసులకు అవార్డు కూడా వచ్చిందన్నారు. గంజాయి మాఫియా రాష్ట్రంలో అడుగుపెట్టాలంటే వెన్నులో వణుకుపుట్టాల్సిందేనన్నారు.
108 దేశాలకు చెందిన ప్రతినిధులు అందాల పోటీల్లో పాల్గొన్నారన్నారు. సుందరీమణుల పోటీలు అందాల పోటీలు మాత్రమే కాదని, అందాల పోటీలతో తెలంగాణ బ్రాండ్ ప్రపంచానికి పరిచయం చేశామన్నారు.