Minister Nara Lokesh : మంగళగిరి ప్రజల ప్రేమను మరిచిపోలేదు : మంత్రి నారా లోకేశ్

Minister Nara Lokesh : మంగళగిరిలో ఏడాదిలో 3 వేల మందికి ఇంటి పట్టాలు ఇచ్చినట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ‘మన ఇల్లు-మన లోకేశ్’ తొలి దశ చివరి రోజు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మంగళగిరి పేదలకు రూ.వెయ్యి కోట్ల విలువైన భూమిని ఇచ్చినట్లు తెలిపారు. ఈ ప్రాంత ప్రజల ప్రేమను ఎప్పటికీ మరిచిపోలేనని స్పష్టం చేశారు. మంగళగిరి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తామని హామీనిచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము సొంత నిధులతో 26 కార్యక్రమాలు చేపట్టిన్నట్లు గుర్తుచేశారు.
100 పడకల ఆసుపత్రికి భూమి పూజ..
మరోవైపు మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రికి నారా లోకేశ్ భూమి పూజ చేశారు. 7.35 ఎకరాల్లో 52.20 కోట్లతో నిర్మాణం జరుగనుంది. దేశంలోనే అత్యున్నత ఆసుపత్రిగా నిర్మాణం చేయనున్నారు. ఏడాదిలోగా ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేశ్ పాల్గొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు దీన్ని నిర్మాణం చేపట్టారు. అత్యాధునిక వసతులతో ఏడాదిలోపు ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించారు. టిడ్కో నివాసాల వద్ద ఏర్పాటు చేసిన సురక్షిత తాగునీటి పథకాన్ని మంత్రి లోకేశ్ ప్రారంభించారు.
1984లో 30 పడకల ఆసుపత్రికి దివంగ మాజీ సీఎం నందమూరి తారక రామారావు వచ్చి శంకుస్థాపన చేశారని గుర్తుచేశారు. యువగళం పాదయాత్రకు వచ్చినప్పుడు స్థానికులు 30 పడకల ఆసుపత్రిని 100 పడకలుగా చేయాలని కోరారని చెప్పారు. ప్రైవేట్ ఆసుపత్రికి దీటుగా 100 పడకల ఆసుపత్రి ఉంటుందని స్పష్టం చేశారు. అమరావతిలో అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయన్నారు. ఆసుపత్రిలో డీహైడ్రేషన్ కేంద్రాన్ని కలుపుతామని చెప్పారు.