Last Updated:

Telangana Assembly: ఈ నెల 9 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు.. గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ

Telangana Assembly: ఈ నెల 9 నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు.. గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ

Telangana Assembly Sessions To Start From December 9: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. డిసెంబర్‌ 9న ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభం కానున్నాయి. అనంతరం బీఏసీ సమావేశం జరుగనుంది.

పలు కీలక చట్టాల ఆమోదానికి సర్కారు సిద్ధం
ప్రతీరోజూ ఉదయం 10.30 గంటలకు అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయని నోటిఫికేషన్‌లో ప్రభుత్వం పేర్కొంది. సమావేశాల్లో పలు కీలక చట్టాల ఆమోదానికి రేవంత్ సర్కారు సిద్ధం చేస్తోంది. పంచాయతీ ఎన్నికలపై చర్చించే అవకాశం ఉందని సమాచారం. నూతన ఆర్ఓఆర్ చట్టం, కులగణన సర్వే, బీసీ రిజర్వేషన్, పలు కొత్త చట్టాలు అసెంబ్లీలో చర్చించనున్నట్లు తెలిసింది.

రైతు భరోసాపై అసెంబ్లీలో చర్చ
సంక్రాంతి తర్వాత రైతు భరోసా వేస్తామని సీఎం ప్రకటించారు. అయితే, అందుకు సంబంధించిన విధివిధానాల రూపకల్పనపై ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం ఇప్పటికే పలు అంశాలతో కూడిన నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ అంశాలను అసెంబ్లీలో చర్చించి రైతు భరోసా అర్హులైన రైతులకే దక్కేవిధంగా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది.

సభకు కేసీఆర్‌ వస్తారా? లేదా?
అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్‌ రావాలని సీఎం రేవంత్‌రెడ్డి వివిధ సందర్భాల్లో డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సభకు కేసీఆర్‌ వస్తారా? లేదా? అనేదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది.