RBI Annual Report: చలామణిలో ఎక్కువగా ఉన్న కరెన్సీ ఏంటో తెలుసా?
2022- 23లో మార్కెట్ లో ఉన్న కరెన్సీ నోట్ల విలువ 7. 8 శాతం పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ ఇండియా వార్షిక రిపోర్టు వెల్లడించింది. నోట్ల సంఖ్య 4.4 శాతం పెరిగినట్టు రిపోర్టు తెలిపింది.
RBI Annual Report: 2022- 23లో మార్కెట్ లో ఉన్న కరెన్సీ నోట్ల విలువ 7. 8 శాతం పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ ఇండియా వార్షిక రిపోర్టు వెల్లడించింది. నోట్ల సంఖ్య 4.4 శాతం పెరిగినట్టు రిపోర్టు తెలిపింది. అదే విధంగా చలామణిలో ఉన్న కరెన్సీ నోట్ల విలువలో రూ. 500 , రూ. 2000 నోట్ల విలువ 87.9 శాతం అని పేర్కొంది. ఇదే శాతం 2021-22 లో 87.1 గా ఉంది. ఇటీవలే రూ. 2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకున్నట్టు ఆర్బీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. వాటిని మార్చుకోవడం లేదా డిపాజిట్ చేయడానికి సెప్టెంబరు 30 వరకు గడువు ఇచ్చింది.
వార్షిక రిపోర్టులోని అంశాలు(RBI Annual Report)
చలామణిలో ఉన్న నోట్లలో 2023 మార్చి 31 నాటికి సంఖ్యా పరంగా రూ. 500 నోట్లే ఎక్కువ . తర్వాత రూ.10 నోట్లు ఉన్నాయి. మొత్తం 5,16,338 లక్షల రూ. 500 నోట్లు మార్కెట్లు చలామణిలో ఉన్నాయి. వీటి విలువ రూ. 25,81,690 కోట్లు.
మార్చి ముగిసే నాటికి రూ. 2,000 నోట్లు 4,55,468 లక్షలు చలామణిలో ఉన్నాయి. వీటి విలువ రూ. 3, 62, 220 కోట్లు. క్రితం ఏడాదితో పోలిస్తే రూ. 2 వేల నోట్ల సంఖ్య 1. 3 శాతం తగ్గింది.
ప్రస్తుతం రూ. 2, రూ. 5, రూ.10, రూ. 20, రూ.100, రూ. 200, రూ. 500, రూ. 2,000 విలువ చేసే నోట్లు చలామణిలో ఉన్నాయి. నాణేలు 50 పైసలు, రూ. 1, రూ. 2, రూ. 5, రూ. 10, రూ. 20 చలామణిలో ఉన్నాయి.
2022-23 లో ఆర్బీఐ ప్రయోగాత్మకంగా ఈ రూపీని తీసుకొచ్చింది. ప్రస్తుతం చలామణిలో ఉన్న హోల్సేల్ ఈ రూపీల విలువ రూ. 10.69 కోట్లు. అలాగే రిటైల్ ఈ రూపీల విలువ రూ. 5. 70 కోట్లు.
కొత్త నోట్ల ముద్రణ 2021- 22తో పోలిస్తే 2022- 23లో 1.6 శాతం పెరిగింది. రూ. 2,000 ముద్రణకు క్రితం సంవత్సరాల్లోలాగే ఎలాంటి ఆదేశాలు రాలేదు.
నోట్ల ముద్రణ కోసం 2022- 23లో కేంద్రం రూ. 4,682.80 కోట్లు ఖర్చు చేసింది. గత ఏడాది ఈ విలువ రూ. 4, 984. 80 కోట్లుగా ఉంది.
గత ఏడాదితో పోలిస్తే నకిలీ నోట్లు తగ్గాయి. రూ.10 విలువ చేసే నకిలీ నోట్లు 11.6 శాతం, రూ.100 నోట్లలో 14.7 శాతం, రూ. 2,000 నకిలీ నోట్లు 27.9 శాతం తగ్గాయి.
2022-23 లో బ్యాంకింగ్ సెక్టార్లో గుర్తించిన నకిలీ నోట్లలో 4.6 శాతం ఆర్బీఐలో, 95.4 శాతం ఇతర బ్యాంకుల్లో ఉన్నాయి.