Last Updated:

Patancheru TRS: పటాన్‌చెరు టీఆర్‌ఎస్‌లో ముసలం

పటాన్‌చెరు నియోజకవర్గం టీఆర్‌ఎస్‌లో ముసలం పుట్టింది. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్‌ పై కన్నేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి టీఆర్‌ఎస్‌ నేత, చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తలనొప్పిగా మారారన్న టాక్‌ వినిపిస్తోంది.

Patancheru TRS: పటాన్‌చెరు టీఆర్‌ఎస్‌లో ముసలం

Hyderabad: పటాన్‌చెరు నియోజకవర్గం టీఆర్‌ఎస్‌లో ముసలం పుట్టింది. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్‌ పై కన్నేసిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి టీఆర్‌ఎస్‌ నేత, చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ తలనొప్పిగా మారారన్న టాక్‌ వినిపిస్తోంది. సర్పంచ్ హోదాతోనే నియోజకవర్గం పై పట్టు సాధించడం, పార్టీలోని కొంత క్యాడర్‌ను తనవైపు తిప్పుకోవడం స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి మింగుడుపడడంలేదన్న చర్చ నియోజకవర్గంలో నడుస్తోంది.

ఇంతకాలం పటాన్‌చెరు నియోజకవర్గం వరకే పరిమితమైన నీలం మధు. ఒక అడుగు ముందుకేసి రాష్ట్రా అధినాయకత్వం మెప్పును పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాను సర్పంచ్‌గా ఉన్న చిట్కుల్‌ గ్రామ పంచాయతీలో రాష్ట్రంలోనే అతి పెద్దదైన చాకలి ఐలమ్మ కాంస్య విగ్రహన్ని ఏర్పాటు చేశారు. విగ్రహ అవిష్కరణకు మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావును ఆహ్వానించారు నీలం మధు. పటాన్‌చెరు నియోజకవర్గం నుంచే కాకుండా ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని మిగతా ప్రాంతాల నుంచి కూడా టీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలను ఆహ్వానించారు నీలం మధు. ఇదే ఇప్పుడు పటాన్‌చెరు నియోజకవర్గంలోని టీఆర్‌ఎస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని ఆహ్వానించేందుకు ప్రయత్నించిన నీలం మధుకు ఆయన టైం ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే తమ్ముడు గూడెం మధుసుదన్ రెడ్డిని కలిశారు. చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానం అందజేశారు.

అయితే నీలం మధు తలపెట్టిన చాకలి అయిలమ్మ విగ్రహ అవిష్కరణకు మంత్రులను రాకుండా చేసేందుకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రయత్నిస్తున్నారన్న టాక్ కూడా నియోజకవర్గంలో జోరందుకుంది. విగ్రహ ఆవిష్కరణకు మంత్రులు కేటీఆర్‌, హరీశ్‌రావు వస్తే నీలం మధు గ్రాఫ్ పెరిగినట్టేనని టీఆర్‌ఎస్ క్యాడర్ భావిస్తోంది. వచ్చే ఎన్నికల్లో పటాన్‌చెరు టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశిస్తున్నవారిలో నీలం మధు ముందు వరసలో ఉండటం, ఆర్థికంగా బలంగా ఉండడం, క్యాడర్‌ను ఏకం చేయడం స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి ఇబ్బందికరంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. అయితే ఎవరెన్ని చేసినా ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి ఢోకాలేదంటున్నారు టీఆర్‌ఎస్‌లోని మరో వర్గం.

ఇవి కూడా చదవండి: