Mohan Babu: మోహన్ బాబుకి బిగ్‌షాక్ – జర్నలిస్ట్ దాడి కేసులో సెక్షన్స్ మార్చిన పోలీసులు
Mohan Babu Journalist Attack Case: మంగళవారం తారస్థాయికి చేరిన నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీ వివాదం ప్రస్తుతం చల్లారినట్టు కనిపిస్తోంది. కుటుంబ సభ్యులంతా కలిసి చర్చించుకునేందుకు సిద్ధమయ్యారు. మంచు ఫ్యామిలీకి దగ్గర బంధువులతో రహస్య సమావేశమై చర్చించి ఆస్తి పంపకాలు చేయనున్నారని విశ్వసనీయ సమాచారం. దీంతో మంచు ఫ్యామిలీ గొడవలు సద్దుమనిగేలా కనిపిస్తున్నాయి. కానీ, మోహన్ బాబు జర్నలిస్టులపై చేసిన దాడి అంశం మాత్రం మరింత వివాదంగా మారింది. ఈ కేసులో పోలీసులు సెక్షన్స్ మార్చి ఆయనపై హత్యాయత్నం కేసుగా నమోదు చేశారు.
జల్‌పల్లి నివాసం వద్ద హైడ్రామా
మంగళవారం(డిసెంబర్ 10) జల్‌పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద హైడ్రామా నడిచిన సంగతి తెలిసిందే. మంచు మనోజ్, అతని భార్య మౌనికను ఇంటికి నుంచి బయటకు పంపించారు. దీంతో తన అనుచరులతో కలిసి ఇంట్లోకి వెళ్లేందుకు మనోజ్ ప్రయత్నించగా మోహన్ బాబు, విష్ణు బౌన్సర్లు వారిని అడ్డుకున్నారు. దీంతో గేటును బలవంతం తెరిచి లోపలికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో పోలీసులు అక్కడే ఉన్నారు. ఈ డ్రామా అంతా కూడా వారి ముందే జరిగింది. తనకు మద్దతుగా మనోజ్ మీడియాను తీసుకువెళ్లారు.
ఈ క్రమంలో అక్కడ జరుగుతున్న సంఘటనపై ప్రశ్నించే క్రమంలో మోహన్ బాబు ఇద్దరు విలేఖర్లపై దాడి చేశారు. ఈ సంఘటనపై జర్నలిస్ట్ సంఘాలు మండిపడ్డాయి. వెంటనే మోహన్ బాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. జర్నలిస్ట్‌లపై దాడి ఘటనను సీరియస్ తీసుకున్న పోలీసులు మోహన్ బాబుపై మొదట బీఎన్‌ఎస్ 118 సెక్షన్ కింద నమోదు చేశారు. అంతేకాదు బుధవారం ఉదయం విచారణకు హజరుకావాలని ఆదేశిస్తూ నోటీసులు కూడా ఇచ్చారు. అయితే తాజాగా ఈ కేసులో పోలీసులు మార్పులు చేశారు. బీఎన్‌ఎస్ 118 సెక్షన్‌ను బీఎన్‌ఎస్ 109 సెక్షన్‌గా మార్చి ఎఫ్‌ఐఆర్‌లోనూ మార్పులు చేసి అటెంప్ట్ మర్డర్ కేసుగా నమోదు చేశారు. దీంతో మోహన్ బాబుకు మరింత బిగ్‌షాక్ తగిలింది.