Last Updated:

North Korea: ఇనుప తెరల వెనక ఉత్తర కొరియా

North Korea: ఇనుప తెరల వెనక ఉత్తర కొరియా

North Korea: తమ దేశం హైపర్‌ సోనిక్‌ క్షిపణిని పరీక్షించిందని, పసిఫిక్‌ సముద్రంలోని తమ శత్రువుల పని పట్టేందుకు దీనిని వాడుతామంటూ మూడు రోజుల నాడు ఉత్తర కొరియా నియంత కిమ్‌జోంగ్‌ ఉన్‌ ప్రకటించారు. అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్‌ దక్షిణ కొరియా, జపాన్‌లో పర్యటిస్తున్న వేళ ఈ ప్రయోగం జరగటంతో ఆయన ప్రకటన అమెరికాను ఉద్దేశించిందని ప్రపంచం భావిస్తోంది. కాగా, ఉత్తర కొరియా చర్యలను ఆంటోనీ బ్లింకెన్‌ ఖండించారు. స్పేస్‌ టెక్నాలజీలో ఉత్తరకొరియా, రష్యాల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చైనా, రష్యా మద్దతుతో దక్షిణ కొరియా, అమెరికా మీద ఒంటికాలి మీద లేస్తున్న కిమ్.. తీరు ఆదినుంచీ వివాదాస్పదమే. కిమ్ ఉక్కు పిడికిలిలో నలిగిపోతున్న ఉత్తర కొరియాలో కఠిన ఆంక్షలు, నిర్బంధాలు కొనసాగుతున్నాయి. ఈ విషయాన్ని పశ్చిమదేశాలు, వాటి మిత్రదేశాలు ఐరాస భద్రతా మండలిలో తరచూ ప్రస్తావిస్తూనే ఉన్నప్పటికీ, ఇదంతా రాజకీయ రచ్చేనంటూ కిమ్, ఆయన మిత్రులైన పుతిన్, జింగ్ పింగ్ కొట్టిపారేస్తున్నారు. కొవిడ్ తర్వాత కూడా సరిహద్దులను తెరిచేందుకు కిమ్ ఇష్టపడకపోవటంతో, గత నాలుగేళ్లుగా ఐక్యరాజ్యసమితికి చెందిన సిబ్బంది ఎవరూ అక్కడ లేకపోవటంతో ఆ దేశంలో ఏంజరుగుతుందనేది బొత్తిగా బయటకు రావటం లేదు.

ఆ దేశానికి వెళ్లే అతి కొద్దిమంది విదేశీ టూరిస్టులను అక్కడ అడుగుపెట్టగానే అణువణువూ తనిఖీ చేస్తారు. వారు నిర్దిష్టమైన ప్రదేశాలు, మార్గాల్లో మాత్రమే పర్యటించాలి. ట్రిప్ పూర్తయ్యే వరకు ఓ గైడ్.. టూరిస్టుల వెన్నంటే ఉంటారు. ట్రిప్‌లో కెమెరాలకు అనుమతి ఉండదు. అలాగే ఆ దేశ పౌరులతో మాట్లాడకూడదు. వీటిలో ఏది ఉల్లంఘించినా జైలు శిక్ష ఖాయం. అందుకే ఆ దేశపు ఫోటోలేవీ సోషల్ మీడియాలో నేటికీ కనిపించవు. కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్, ఆయన పర్యటనల ఫొటోలూ, ఆయన టీమ్ ఆమోదం తర్వాతే రిలీజవుతాయి. ఆ దేశపు చట్టాలు, శిక్షల గురించీ బయటికి పొక్కకుండా కఠిన ఆంక్షలు విధించారు. విదేశీ సంస్కృతి ప్రభావం తమ పౌరులపై పడకుండా ఉండేందుకు కిమ్ విదేశీ సినిమాల మీద, పాశ్చాత్య సంగీతం, పాటల మీద నిషేధం విధించారు. అలా.. నిషేధించిన సినిమాలు, పాటల తాలూకు కేసెట్లు, సీడీలను 2015లోనే కిమ్ తగలబెట్టించేశారు. ఎవరైనా దొంగచాటుగా వింటున్నట్లు తెలిస్తే, వారిని జైలులో పారేయటమే. అమెరికా సినిమాలు, పోర్నోగ్రఫీ చూస్తే.. మరణశిక్షే. ఆ దేశంలో 3 చానళ్లే ప్రసారమవుతాయి. వాటిలోని కంటెంట్‌నూ ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. అదనంగా కరెంటు వాడుకోవాలన్నా.. ప్రభుత్వ అనుమతి ఉండాల్సిందే. దేశంలోని వేరే ప్రాంతాల వారు రాజధాని ప్యాంగ్‌యాంగ్‌లో నివసించాలన్నా, అనుమతి తప్పనిసరి.

ఆ దేశ పౌరులు విదేశీయులకు ఫోన్ కాల్స్ చేయటమనేది అక్కడ దారుణమైన నేరం. తన విదేశీ మిత్రులకు ఫోన్ చేసిన పాపానికి, గతంలో ఓ ఫ్యాక్టరీ యజమానిని బహిరంగంగా కాల్చి చంపారు. నచ్చిన హెయిర్ కట్ చేయించుకునే ఛాన్స్ కూడా అక్కడి పౌరులకు లేదు. ప్రభుత్వం ఆమోదించిన 18 హెయిర్‌కట్స్‌నే అందరూ ఫాలో కావాలి. వీటిలో 8 మహిళలకు, 10 పురుషులకు కేటాయించారు. అవివాహిత మహిళల కంటే వివాహిత మహిళల జుత్తు పొడవుగా ఉండాలని 2013లో కిమ్ ఒక ప్రత్యేకచట్టాన్ని రూపొందించారు. అయితే తన హెయిర్ స్టయిల్ ప్రత్యేకంగా ఉండాలనే ఉద్దేశంతో.. దానిని ఆ చట్టంలో చేర్చలేదు. కిమ్ నిరంకుశ ప్రభుత్వం ఆఖరికి ఆటలనూ వదల్లేదు. బాస్కెట్‌బాల్ నిబంధనలను సొంతంగా రూపొందించుకుంది. కిమ్‌తో భేటీ సమయంలో ఏ అధికారైనా కునుకుతీస్తే మరణశిక్ష ఖాయం. అలా చేయటమనేది కిమ్ పట్ల అమర్యాదగా భావిస్తారు. 2015లో కిమ్ నిర్వహించిన సైనిక సమావేశంలో నిద్రలోకి జారుకున్న నాటి రక్షణ మంత్రి హోన్ యాంగ్-చోని వందమంది ఎదుట కాల్చి చంపారు. ఇక నేరాలకు పాల్పడిన వ్యక్తి కుటుంబంతో బాటు నేరగాళ్ల తండ్రి, తాతలనూ జైలులో పెడతారు. జైళ్ల నుంచి ఖైదీలు ఎవరూ పరారు కాకుండా చూసేందుకే ఈ కఠిన నియమాన్ని అమలు చేస్తున్నారు.

రాజకీయ నేరస్థులను నిర్బంధ శిబిరాలకు తరలిస్తారు. ప్రస్తుతం దేశంలో సుమారు 2 లక్షల మంది ఈ శిబిరాల్లో ఉన్నట్లు సమాచారం. ట్విస్ట్ ఏమిటంటే.. రాజకీయ నేరస్థులతో పాటు వారి కుటుంబసభ్యులూ ఆ క్యాంపుల్లో మగ్గిపోవాల్సిందే. ఎవరైనా పారిపోవడానికి యత్నిస్తే.. ఆ కుటుంబం మొత్తాన్ని చంపేస్తారు. క్యాంపుల్లో 40% పైగా నేరస్థులు పోషకాహారలోపంతోనే మరణిస్తున్నారు. ఇక దేశంలోని పురుషులు పదేళ్లు, మహిళలు ఏడేళ్ల పాటు సైన్యంలో పనిచేయటం తప్పనిసరి. అలాగే, దేశ విద్యా విధానంలోనూ కఠిన నిబంధనలున్నాయి. క్లాస్ రూంలలో తమ కుర్చీలు, డెస్క్‌ల కోసం విద్యార్థులు విడిగా డబ్బులు కట్టాలి. ఈ మొత్తాన్ని ఫీజుల్లో చేర్చరు. ఆధునిక ఎలక్ట్రానిక్ వస్తువులు, టెక్నాలజీ ఏమిటో అక్కడి పౌరులకు తెలీదు. ఐఫోన్లు, లాప్‌టాప్‌ల మీద గట్టి నిషేధం ఉంది. దేశంలో బైబిల్ కూడా నిషిద్ధమే. పశ్చిమదేశాల సంస్కృతిలో అది ఓ భాగమని, అది చదివిన వారి మనసు మారుతుందని పాలకుడికి భయమట. గతంలో ఓ అమెరికన్ మహిళా టూరిస్ట్ 2014లో తాను బస చేసిన రెస్టారెంట్‌లో బైబిల్‌ను మరిచిపోయినందుకు 5 నెలల ఖైదు అనుభవించింది.

ఉత్తర కొరియాలోనూ ఎన్నికలు జరుగుతాయి. అయితే, అవి కిమ్‌కు అనుకూలంగా జరుగుతాయి. 17 ఏళ్లు నిండిన అందరూ ఓటేయొచ్చు. ప్రతి ఎన్నికలోనూ ఓటరూ కిమ్‌‌కే ఓటు వేస్తారు. అదీ పెద్దగా నవ్వుతూ, కిమ్ వంశీకులను పొగడుతూ పోలింగ్ క్యూలో నిలబెడతారట. కమ్యూనిస్టు విప్లవం తర్వాత ఆ దేశానికి కిమ్ ఇల్ సంగ్ సారథ్యం వహించగా, తర్వాత ఆయన కొడుకు, ఇప్పుడు మనవడు కొరియాను పాలిస్తున్నారు. దేశపౌరులు తమ సుప్రీంనేత కిమ్ పట్ల రాజభక్తితో ఉంటామంటూ ప్రమాణం చేయాలి. కిమ్‌ను ప్రశ్నించినా, శంకించినా, ధిక్కరించినా అది దైవదూషణ కిందే లెక్క. పౌరులకైనా, టూరిస్టులకైనా ఇదే నియమం. ఈ నిబంధనలు తట్టుకోలేక పలువురు దేశం విడిచి పారిపోవాలని ప్రయత్నించారు. కానీ, వారందరినీ అక్కడికక్కడే కాల్చి చంపేశారు. ఇలా రాస్తూ పోతే, ఆ దేశం, అక్కడి నియంత కథ ఎన్నటికీ సమాప్తం కాదు. ఎంతో చరిత్ర గల కొరియన్ గడ్డమీద ఈ పాలన తొలగిపోయి, ప్రజాస్వామ్య పవనాలు వీయాలని పలు దేశాలు కోరుతున్నప్పటికీ, అక్కడి భౌగోళిక రాజకీయాల మూలంగా అది ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించటం లేదు.

ఇవి కూడా చదవండి: