Donald Trump: వెంటనే పైలట్లను వెనక్కి రప్పించండి : ఇజ్రాయెల్‌కు అమెరికా అధ్యక్షడు ట్రంప్ వార్నింగ్

Trump warning to Israel: ఇరాన్-ఇజ్రాయెల్ ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాల్పుల విరమణ కుదిరినప్పటికీ రెండుదేశాలు పరస్పరం దాడులు చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇరాన్, ఇజ్రాయెల్ ఇరుదేశాలు కాల్పుల విరమణను ఉల్లంఘించాయని చెప్పారు. ఈ క్రమంలో వెంటనే పైలట్లను వెనక్కి రప్పించాలని ఇజ్రాయెల్‌కు ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.
ఇజ్రాయెల్ ఆ బాంబులను వేయొద్దు..
ఇజ్రాయెల్ ఆ బాంబులను వేయొద్దని సూచించారు. అలా చేస్తే అది తీవ్ర ఉల్లంఘనే అని హెచ్చరించారు. పైలట్లను వెంటనే వెనక్కి రప్పించంచాలని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ తరఫున ఇరాన్‌పై ఇటీవల దాడులు చేసిన ట్రంప్.. రెండు వారాల్లో మిత్రదేశానికి సూటి హెచ్చరికలు చేయడం ఇదే తొలిసారి.
ది హేగ్‌లో జరిగే నాటో సదస్సుకు బయలుదేరే ముందు ట్రంప్ మీడియాతో మాట్లాడారు. కాల్పుల విరమణ తర్వాత రెండుదేశాలు పరస్పరం మళ్లీ దాడులు చేసుకున్న విషయాన్ని ధ్రువీకరించారు. ఇరాన్‌తోపాటు ఇజ్రాయెల్ కాల్పుల విరమణను ఉల్లంఘిచిందని తెలిపారు. ఇజ్రాయెల్ చర్యపట్ల తాను సంతోషంగా లేనని పేర్కొన్నారు. టెల్ అవీవ్ శాంతించాలని, అదే తాను కోరుకుంటున్నానని స్పష్టం చేశారు. కొన్ని గంటలకే ట్రంప్ మరో ప్రకటన విడుదల చేశారు. ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేయబోదని పేర్కొన్నారు. అన్ని విమానాలు తిరిగి వెనక్కి వచ్చేస్తాయని స్పష్టం చేశారు. కాల్పుల విరమణ కొనసాగుతోందని, ఎవ్వరికీ గాయాలు కాలేదని వెల్లడించారు. ఇరాన్ ఎప్పటికీ అణు కేంద్రాలను పునర్మించుకోలేదని ట్రంప్ స్పష్టం చేశారు.