Shashi Tharoor Criticizes Trump: లాడెన్‌ను అప్పుడే మరచిపోయారా..? మునీర్‌కు ట్రంప్ విందుపై శశిథరూర్ విమర్శలు!
Shashi Tharoor Criticizes Trump on Asim Munir Dinner: పాక్ ఆర్మీ చీఫ్ ఆసీం మునీర్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విందు ఇవ్వడంపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ తీవ్ర విమర్శలు చేశారు. ఒసామా బిన్ లాడెన్‌కు ఆశ్రయం కల్పించడంలో పాకిస్థాన్ పాత్రను అమెరికా మరచిపోకూడదన్నారు.
వరల్డ్ ట్రేడ్ సెంటర్ దాడిలో ప్రధాన సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ ఎపిసోడ్‌ను పాకిస్థాన్ బృందాన్ని కలిసిన కొంతమంది చట్టసభ సభ్యులు మరచిపోయినప్పటికీ అమెరికా ప్రజలు మాత్రం తొందరగా మరచిపోలేరన్నారు. ఇటువంటి వ్యక్తి దొరికేవరకు ఓ ఆర్మీ క్యాంపు దగ్గర పాకిస్థాన్ దాచిపెట్టిన విషయాన్ని అమెరికన్లు అంత తొందరగా మరచిపోరని పేర్కొన్నారు. ఉగ్రవాదులకు శిక్షణ, ఆర్థిక పరంగా మద్దతు ఇవ్వకూడదనే విషయాన్ని పాకిస్థాన్‌కు ట్రంప్ హెచ్చరించి ఉంటారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
కొందరి నేతలతో భిన్నాభిప్రాయాలు నిజమే : థరూర్
కాంగ్రెస్ అగ్రనాయకత్వంలో కొందరితో తనకు భిన్నాభిప్రాయాలు ఉన్న మాట వాస్తవమేనని శశి థరూర్ అంగీకరించారు. అయితే పార్టీ అంతర్గత సమావేశంలోనే చర్చిస్తానని చెప్పారు. ఆపరేషన్ సిందూర్‌పై ఏర్పాటైన అఖిలపక్ష బృందానికి నాయకత్వం వహించిన థరూర్.. ప్రధాని మోదీని కలిసిన సందర్భంలో పర్యటన గురించి తప్ప వేరే విషయాలు చర్చించలేదని స్పష్టం చేశారు.