Published On:

Donald Trump : పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత ఇరాన్‌దే : అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

Donald Trump : పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత ఇరాన్‌దే : అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌

US President Donald Trump: పశ్చిమాసియాలో పూర్తిగా శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత ఇరాన్‌దేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అన్నారు. మధ్య ప్రాచ్య దేశాలను టెహ్రాన్‌ భయపెడుతున్నారని ఆరోపించారు. ఇరాన్ అణు సామర్థ్యాన్ని నాశనం చేయడం, ప్రపంచం ఎదుర్కొంటున్న అణుముప్పును ఆపడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఇరాన్‌పై దాడులు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఇది అమెరికా మిలటరీ విజయమని ప్రశంసించారు. ఇరాన్‌లో కొన్ని లక్ష్యాలు మిగిలే ఉన్నాయన్నారు. ఇరాన్‌ శాంతిని నెలకొల్పకపోతే దాడులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఇరాన్‌పై దాడిని చారిత్రక క్షణంగా అభివర్ణించారు.

 

ఇరాన్‌పై దాడుల తర్వాత ట్రంప్‌ మొదటిసారిగా స్పందించారు. వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడారు. ఇరాన్‌పై తాము దాడులు చేశామని పేర్కొన్నారు. కీలకమైన అణు స్థావరాలను పూర్తిగా ధ్వంసం చేశామన్నారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అణుముప్పును ఆపడమే తమ లక్ష్యమని తెలిపారు. అమెరికా, ఇజ్రాయెల్‌, ప్రపంచానికి ఇది చారిత్రక క్షణమన్నారు. తాము చేసిన దాడులు కష్టతరమని, ప్రపంచంలోని ఏ దేశానికి ఇది సాధ్యం కాదన్నారు. మధ్య ప్రాచ్య దేశాలను ఇరాన్‌ భయపెడుతున్నదన్నారు. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పాల్సిన బాధ్యత ఇరాన్‌దేనని చెప్పారు. యుద్ధానికి ముగింపు పలకాల్సిన పరిస్థితికి ఇరాన్‌ వచ్చిందన్నారు. యుద్ధం కొనసాగకూడదని స్పష్టం చేశారు. ఇరాన్‌ శాంతి మార్గంలో వెళ్లకపోతే దాడులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. తమ లక్ష్యాలు తమకు ఉన్నాయని, తాము తలచుకుంటే అన్నింటిని నాశనం చేస్తామని హెచ్చరించారు.

 

అమెరికా, ఇజ్రాయెల్‌ ఇరుదేశాలు బృందంగా పనిచేస్తాయని చెప్పారు. ఇరాన్‌ జనరల్‌ చేతిలో చాలామంది బలయ్యారన్నారు. అమెరికా ప్రజలు కూడా చనిపోయారని వెల్లడించారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకూడదని, జరగనివ్వనని స్పష్టం చేశారు.

 

ఇజ్రాయెల్‌, ఇరాన్‌ యుద్ధంలోకి అమెరికా ప్రత్యక్షంగా ప్రవేశించింది. బీ-2 స్పిరిట్‌ బాంబులతో విరుచుకుపడింది. దేశంలోని మూడు అణుస్థావరాలపై దాడులు చేసింది. ఇజ్రాయెల్‌ సైన్యంతో కలిసి ఫోర్డో, నంతాజ్‌, ఇస్ఫహాన్‌ అణుకేంద్రాలపై దాడులకు పాల్పడింది. ఫోర్డో అణు స్థావరాన్ని ధ్వంసం చేశామని అమెరికా ప్రకటించింది. అమెరికా దాడులను ఇరాన్‌ ధ్రువీకరించింది.

 

ఇవి కూడా చదవండి: