Russia : ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణి దాడి.. 21 మంది మృతి, 80మందికి గాయాలు

Russia : ఉక్రెయిన్‌పై రష్యా మరోసారి విరుచుకుపడింది. సుమీ నగరంపై జరిపిన క్షిపణుల దాడిలో 21 మంది మృతి చెందగా, 80 మంది గాయపడ్డారు. స్థానిక తాత్కాలిక మేయర్ ఆర్టెమ్ కొబ్జార్ వివరాలను వెల్లడించారు. మట్టల ఆదివారం పండుగ సందర్భంగా స్థానికులు ఒకేచోటకు చేరగా, రెండు క్షిపణి దాడులు జరిగాయని తెలిపారు. పండుగ సందర్భంగా మహా విషాదం చోటుచేసుకుందని సామాజిక మాధ్యమాల వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ మౌలిక సదుపాయాలపై దాడుల నిలిపివేతకు అగ్రరాజ్యం అమెరికా మధ్యవర్తిత్వం వహించిన తాత్కాలిక ఒప్పందాన్ని ఉల్లంఘించారని రష్యా, ఉక్రెయిన్ అగ్ర దౌత్యవేత్తలు పరస్పరం ఆరోపించుకున్న వేళ దాడులు చోటుచేసుకున్నాయి.
ఖండించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు..
సుమీ నగరంపై జరిగిన దాడులను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఖండించారు. సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకున్నారని, దాడుల్లో నివాస భవనాలు, విద్యాసంస్థలు, కార్లు ధ్వంసం అయ్యాయని మండిపడ్డారు. పదుల సంఖ్యలో పౌరులు మృతిచెందారని తెలిపారు. ఘటనపై ప్రపంచ దేశాలు స్పందించాలని డిమాండ్ చేశారు. మాస్కో ఇలాంటి ఉగ్ర చర్యలను కోరుకుంటుందని, ఎప్పూడు యుద్ధాన్ని లాగుతోందని ఆరోపించారు. రష్యాపై ఒత్తిడి లేకుండా శాంతి స్థాపన అసాధ్యం అన్నారు. మాస్కో విషయంలో చర్చలు ఎన్నడూ క్షిపణులు, వైమానిక దాడులను నిలువరించలేకపోయాయని తెలిపారు. ఓ ఉగ్రవాదితో ఏ విధంగా వ్యవహరిస్తారో రష్యా పట్ల అటువంటి వైఖరి అవసరం అన్నారు.