Published On:

Divyabharathi: అతనితో నాకే సంబంధం లేదు.. ఇదే చివరిసారి చెప్పడం

Divyabharathi: అతనితో నాకే సంబంధం లేదు.. ఇదే చివరిసారి చెప్పడం

Divyabharathi: ఇండస్ట్రీలో పుకార్లు ఎలా ఉంటాయి అనేది అందరికీ తెల్సిందే. ముఖ్యంగా హీరోహీరోయిన్లు కలిసి రెండు సినిమాలు చేసినా..  ఆ సినిమాల తరువాత కలిసి బయట కనిపించినా.. వారిద్దరి మధ్య ఏదో ఎఫైర్ నడుస్తుందని వార్తలు పుట్టుకొస్తాయి. ఇక పెళ్ళైన హీరో కానీ, హీరోయిన్ కానీ.. విడాకులు ప్రకటిస్తే చాలు దానికి కారణం వారు ఇంకొకరితో ఎఫైర్ పెట్టుకున్నారని, అందుకే విడాకులు తీసుకుంటున్నారని  సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తూ ఉంటారు.

 

ఇక కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ హీరో GV ప్రకాష్ విడాకులకు బ్యాచిలర్ భామ దివ్యభారతి కారణమని గత కొంతకాలంగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గతేడాదిలోనే GV ప్రకాష్, గాయని సైంధవి విడాకులు ప్రకటించారు. ఈ ఏడాదిలో వారి విడాకులు మంజూరు అయ్యాయి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట తమ 12 ఏళ్ల వివాహా బంధాన్ని విడాకులతో ముగించారు. 

 

GV ప్రకాష్, గాయని సైంధవి విడాకుల అనంతరం కూడా కలిసి పనిచేశారు. మలేషియాలో జరిగిన ఒక సంగీత కచేరీలో విడిపోయిన తర్వాత మొదటిసారిగా కలిసి ఒకే వేదికపై కనిపించారు. అయితే వీరిద్దరూ బాగానే ఉన్నారని, వీరి మధ్యలోకి దివ్యభారతి రావడంతోనే GV  ప్రకాష్.. విడాకులు కోరాడని పుకార్లు రావడంతో.. చాలామంది దివ్యభారతిపై మండిపడుతున్నారు. 

 

బ్యాచిలర్ సినిమాలో GV ప్రకాష్, దివ్యభారతి కలిసి నటించారు. ఈ సినిమాలో వీరి కెమిస్ట్రీ చూసి నిజంగానే వీరు బయట కూడా లవర్స్ అనుకున్నవారు కూడాలేకపోలేదు. అప్పటి నుంచే  ఈ జంట మధ్య ప్రేమాయణం మొదలైందని, ఆమె కోసమే మ్యూజిక్ డైరెక్టర్ భార్యకు విడాకులు ఇచ్చినట్లు వార్తలు వచ్చాయి.

 

బ్యాచిలర్ మూవీ తరువాత ఈ జంట కింగ్ స్టన్ అనే సినిమాలో కూడా నటించారు. అప్పటికే GV ప్రకాష్ విడాకులు తీసుకోవడంతో ఈ పుకార్లపై దివ్యభారతి అప్పుడే క్లారిటీ ఇచ్చింది. తనకు, GVకి మధ్య ఏమి లేదని, తనను ఇందులోకి లాగొద్దని చెప్పుకొచ్చింది. అయినా కూడా కొంతమంది ఆమెను తప్పుపడుతూ సోషల్ మీడియాలో తిట్టిపోస్తున్నారు.

 

ఇక తాజాగా మరోసారి దివ్యభారతి సోషల్ మీడియా వేదికగా స్పందించింది. GV ప్రకాష్ విడాకులకు తనకు ఎటువంటి సంబంధం లేదని ఖరాకండీగా చెప్పుకొస్తూ ఒక పోస్ట్ పెట్టింది. ” నా పేరు నాకు ఎలాంటి సంబంధం లేని వ్యక్తిగత కుటుంబ విషయంలోకి లాగబడింది. GV కుటుంబ సమస్యలతో నాకు ఎటువంటి సంబంధం లేదు. నిర్మొహమాటంగా చెప్పాలంటే, నేను ఎప్పుడూ అతనితో డేటింగ్ చేయలేదు. ముఖ్యంగా ఒక పెళ్ళైన వాడితో డేటింగ్ చేయను.

 

ఇవన్నీ పుకార్లు కాబట్టి.. స్పందించకపోతే సెట్ అవుతుంది అనుకోని నేను ఇప్పటివరకు మౌనంగా ఉన్నాను. అయితే, ఇది ఒక గీత దాటింది. నిరాధారమైన ఆరోపణలతో నా పేరును చెడగొట్టాలని చూస్తుంటే నేను ఊరుకోను. నేను ఒక స్ట్రాంగ్ మరియు స్వంతంత్రంగా బతికే మహిళను. అంతేకాకుండా ఒక గాసిప్ వలన నన్ను నిర్వచించలేరు. ఇలాంటి పుకార్లు, నెగిటివిటీ సృష్టించే బదులు ఏదైనా సమాజానికి పనికి వచ్చే పని చేసుకోండి. ఈ మ్యాటర్ లో ఇదే నా మొదటి మరియు నా చివరి ప్రకటన. థాంక్యూ” అని చెప్పుకొచ్చింది. ఇక ఈ ప్రకటనతో ఈ పుకార్లకు చెక్ పడినట్లు అయ్యింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది.