Reliance Industries Board: రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు లోకి ముఖేష్ అంబానీ సంతానం
ఆసియా అపర కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డును ప్రక్షాళన చేశారు. బోర్డులోకి కొత్తగా తన ముగ్గురు పిల్లలు ఈషా, ఆకాశ్, అనంత్ అంబానీలను తీసుకున్నారు. ఇప్పటి వరకు ఆయన ముగ్గురు పిల్లలు తమ తమ వ్యాపార కార్యకలాపాలు చూసుకొనే వారు.
Reliance Industries Board: ఆసియా అపర కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డును ప్రక్షాళన చేశారు. బోర్డులోకి కొత్తగా తన ముగ్గురు పిల్లలు ఈషా, ఆకాశ్, అనంత్ అంబానీలను తీసుకున్నారు. ఇప్పటి వరకు ఆయన ముగ్గురు పిల్లలు తమ తమ వ్యాపార కార్యకలాపాలు చూసుకొనే వారు. అయితే తాజాగా దేశంలోని అతి పెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో వారికి ప్రాతినిధ్యం కల్పించారు. బోర్డు నుంచి నీతా అంబానీ చేసిన రాజీనామాను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ డైరెక్టర్ల బోర్డు సోమవారం ఆమోదించింది. ఆమె తన శక్తియుక్తులను మరియు సమయాన్ని రిలయన్స్ ఫౌండేషన్ కు కేటాయించాలని కోరుకుంటున్నారు.
నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌లుగా..(Reliance Industries Board)
రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక సాధారణ సమావేశానికి ముందు రిలయన్స్ బోర్డు సమావేశం అయ్యింది. ఈ సమావేశంలోనే ఈషా, ఆకాశ్, అనంత్‌లను నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌లుగా నియమించారు. ఈ విషయాన్ని స్టాక్ ఎక్స్చేంజీలకు కూడా సమాచారం అందించారు. ఇదిలా ఉండగా గత ఏడాది ముఖేష్ అంబానీ తన పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీని దేశంలోని అతి పెద్ద మొబైల్ కంపెనీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్‌కు చైర్మన్‌గా నియమించారు. కాగా జియో ఇన్ఫోకామ్ మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్. దీని చైర్మన్ ముఖేష్ అంబానీ. కాగా జియో ఇన్ఫోకామ్‌లో మేటా, గూగుల్‌కు కూడా వాటాలున్నాయి.
ఇక ఆకాశ్… ఈషా .. వీరిద్దరు కవలలు. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. మరో సోదరుడు అనంత్ అంబానీ విషయానికి వస్తే కొత్త ఎనర్జీ బిజినెస్ చూస్తున్నారు. ఇప్పటి వరకు రిలయన్స్ అనుబంధ సంస్థల్లో డైరెక్టర్లుగా ఉన్న ముఖేష్ సంతానం.. ఇప్పుడు మాతృసంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో చేరారు. కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఒక ప్రకటనలో వాటాదారులు కొత్త డైరెక్టర్ల నియామకాన్ని ఆమోదించిన తర్వాత నుంచి వీరు బాధ్యతలు స్వీకరిస్తారని తెలిపింది. ఇదిలా ఉండగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్‌గా ముఖేష్ అంబానీ మరో ఐదు సంవత్సరాల పాటు కొనసాగేందుకు వాటాదారుల అనుమతి కోరారు. వాటా దారులు అనుమతి పొందడం లాంచనమే. ముఖేష్ 2029 వరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు చైర్మన్‌గా కొనసాగుతారు. ఇక ముఖేష్ భార్య నీతా అంబానీ రిలయన్స్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేసి తన ముగ్గురు పిల్లల్నీ కంపెనీ బోర్డులో చేరేందుకు మార్గం సుగమం చేశారు.